AP CM Chandrababu: ఉద్యోగాల కల్పనలో మేం ముందున్నాం... కేవలం 15 నెలల్లో 4,71,574 ఉద్యోగాలు కల్పించాం: సీఎం చంద్రబాబు
కేవలం 15 నెలల్లో 4,71,574 ఉద్యోగాలు కల్పించాం: సీఎం చంద్రబాబు

AP CM Chandrababu: ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతరం ప్రజావేదికలో గ్రామస్థులతో మాట్లాడుతూ.. మానవత్వంతో ఆలోచించి పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి నెలా ఒక గ్రామానికి వచ్చి స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, ఇందులో భాగంగానే ఈరోజు దత్తి గ్రామానికి వచ్చానని తెలిపారు.
దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయని, ఉత్తరప్రదేశ్‌లో కేవలం రూ.500 మాత్రమే పింఛన్ ఇస్తున్నారని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో వందకు 13 మందికి పింఛన్ ఇస్తున్నామని, అందులో 59 శాతం మహిళలకే అందిస్తున్నామని వివరించారు. ఒక్క పింఛన్‌తోనే సరిపెట్టకుండా సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామని, అన్ని పథకాలు అమలు చేశామని చెప్పారు. ఆడబిడ్డలు కష్టపడకూడదని ఆనాడు దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని, ఈనాడు ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని తెలిపారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళల సాధికారతకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఉద్యోగాలు కల్పించే బాధ్యత తనదేనని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని, తద్వారా 9 లక్షల ఉద్యోగాలు సృష్టించబోతున్నామని వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టి కీలకమని, దీని ద్వారా యువతకు మెరుగైన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
