N. Chandrababu Naidu: అమరావతి రాజధానిని దేశంలోనే అత్యుత్తమ 'జస్టిస్ సిటీ'గా తీర్చిదిద్దుతాం - సీఎం చంద్రబాబు
అత్యుత్తమ 'జస్టిస్ సిటీ'గా తీర్చిదిద్దుతాం - సీఎం చంద్రబాబు

అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయాలి: సీజేఐని కోరిన సీఎం చంద్రబాబు
N. Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. అవకాశం ఇస్తే నిర్మాణ బాధ్యతలు తీసుకుని, అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. అమరావతిలో నిర్మిస్తున్న 'జస్టిస్ సిటీ'ని దేశంలోనే అత్యుత్తమ మోడల్‌గా అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని, దానికి సీజేఐ సూచనలు, సలహాలు, మార్గదర్శకత్వం అందించాలని కోరారు.
ఈ 'జస్టిస్ సిటీ'లో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ, మధ్యవర్తిత్వ కేంద్రం, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భవనం వంటివన్నీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. న్యాయవ్యవస్థ, పరిపాలనకు సంబంధించిన ప్రతి అంశం ఇక్కడే ఉండేలా చూస్తామని, అమరావతిని జ్యుడిషియల్ హబ్‌గా మారుస్తామని ప్రకటించారు.
విజయవాడలో ఆదివారం 'మధ్యవర్తిత్వంపై రాష్ట్రస్థాయి చర్చ' కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. సీజేఐ సూచనల మేరకు ఏపీ జ్యుడిషియల్ అకాడమీకి మరిన్ని భూములు కేటాయిస్తామని తెలిపారు. సీజేఐ సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రోజంతా అమరావతి, తిరుపతిలో గడపడం ఆనందంగా ఉందని, రాష్ట్ర చరిత్రలో ఇది చారిత్రక సందర్భమని వ్యాఖ్యానించారు.
మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారానికి ప్రోత్సాహం
మధ్యవర్తిత్వంతో కేసు పరిష్కారమైతే ప్రస్తుతం రూ.3 వేలు చెల్లిస్తున్నాం. దీన్ని రూ.10 వేలకు పెంచుతాం. కేసు పరిష్కారం కాకపోయినా మధ్యవర్తిత్వం వహించినందుకు రూ.3 వేలు ఇస్తాం.
అమరావతి రాజధాని ప్రపంచంలోనే అత్యుత్తమ సంప్రదింపుల ప్రాజెక్టు. 29 వేల మంది రైతుల నుంచి 33 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా సమీకరించాం. ఇది ల్యాండ్ మానిటైజేషన్ మోడల్.
అందరూ అమరావతిలో ఒక ఇంటి స్థలం ఉంచుకోవాలి. ఇక్కడ అత్యుత్తమ జీవన ప్రమాణాలు, కాలుష్యరహిత నగరం ఉంటుంది.
జస్టిస్, అభివృద్ధి కలిసి పనిచేయాలి
న్యాయం అందడంలో జాప్యం జరిగితే అభివృద్ధిలోనూ జాప్యం ఏర్పడుతుందని, జస్టిస్, అభివృద్ధి రెండూ కలిసి పనిచేయాలని సీఎం అభిప్రాయపడ్డారు. వేగవంతమైన అభివృద్ధి కోరుకుంటున్నామని, జ్యుడిషియరీ సహకరిస్తే దేశం అగ్రగామిగా మారుతుందని చెప్పారు. తన చిన్నతనంలో తండ్రి చదువు లేకున్నా మధ్యవర్తిత్వం ద్వారా 20-30 గ్రామాల వివాదాలు పరిష్కరించిన విషయాన్ని గుర్తుచేశారు.

