Minister Nara Lokesh: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతాం: మంత్రి నారా లోకేశ్
మంత్రి నారా లోకేశ్

Minister Nara Lokesh: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేశ్ మరోసారి స్పష్టం చేశారు. గురువారం ఎన్టీఆర్ భవన్‌లో ప్రజల వినతులు స్వీకరించిన తర్వాత మీడియాతో ఇష్టాగోష్టిలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
‘‘బీసీ రిజర్వేషన్ల విషయంలో మేము పూర్తి స్పష్టతతో ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా పార్టీ పరంగా 34 శాతం స్థానాలను బీసీలకు ఇచ్చి తీరుతాం. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక’’ అని లోకేశ్ అన్నారు. రిజర్వేషన్లు ఖరారు కాకుండానే నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ ఎంత అవగాహనారాహిత్యంలో ఉందో అర్థమవుతోందని విమర్శించారు. రిజర్వేషన్లు రొటేషన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టులో శుక్రవారం నిర్ణయం వెలువడిన వెంటనే షెడ్యూల్ విడుదల అవుతుందని, అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. స్థానిక ఎన్నికలు పూర్తయిన తర్వాతే నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి సారిస్తామని, కార్పొరేషన్ చైర్మన్ల పనితీరును సమీక్షించి రెన్యువల్ విషయం ఆలోచిస్తామని తెలిపారు. పని చేసిన వారికే నామినేటెడ్ పదవులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఓటమి భయంతోనే వైసీపీ స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్లిందని లోకేశ్ విమర్శించారు. తమ పార్టీ ఎన్నికలకు పూర్తి సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

