క్యాలెండర్ విడుదలపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

N. Chandrababu Naidu: రాష్ట్రంలో సంక్షేమ పథకాలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయడానికి త్వరలో 'సంక్షేమ క్యాలెండర్' విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ప్రజాప్రతినిధుల ద్వారా ప్రత్యేక సంక్షేమ లేఖలు అందజేయాలని సీఎం ఆదేశించారు. ఇది పథకాల అమలులో పారదర్శకతను పెంచుతుందని, ప్రజలకు ప్రభుత్వ సేవలు సరిగ్గా చేరుతున్నాయో లేదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని వివరించారు. పెట్టుబడులతో పాటు పేదల శ్రేయస్సుపై కూడా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు – పింఛన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటివి – లబ్ధిదారులకు సరిగ్గా తెలియాలని ఆయన ఒత్తిడి చేశారు.

దీపం 2.0 పథకం కింద డిజిటల్ వౌచర్ల జారీ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. మార్చి 9 నాటికి మహిళలు ఉచిత బస్సు ప్రయాణాల ద్వారా 50.45 కోట్ల ప్రయాణాలు చేశారని, దీని కింద రూ.1,775 కోట్లు ఆర్టీసీకి రీయింబర్స్ చేసినట్లు సీఎం వెల్లడించారు.

డ్వాక్రా, మెప్మా సంఘాల సేవలను సద్వినియోగం చేసుకుని పీ4 (పవర్టీ ఫ్రీ) సహా జీరో పావర్టీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అటవీ శాఖ అధికారులు 'పీపుల్ ఫ్రెండ్లీ'గా మారాలని సీఎం ఆదేశించారు. అటవీ శాఖ వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని సూచించారు. ఈ శాఖపై ఇటీవల ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, దీనిపై డిప్యూటీ సీఎంతో చర్చించినట్లు తెలిపారు.

''కొందరు అటవీ అధికారుల తీరు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఎలా? శ్రీశైలంలో భక్తులను అడ్డుకోవడం, బద్వేలులో ఇలాంటి సంఘటనలు జరగడం వంటివి జరిగాయి'' అని చంద్రబాబు విమర్శించారు.

ఈ సమీక్ష సమావేశంలో సంక్షేమం, అభివృద్ధి, పరిపాలనా విషయాలపై సీఎం వివరంగా చర్చించారు. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు కృతనిశ్చయంతో పనిచేయాలని ఆదేశించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story