Shivraj Singh Chouhan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఆలోచించేది రేపు దేశం ఆచరిస్తుందని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జరిగిన ‘పేదలకు పట్టాభిషేకం’ సభలో ఆయన ప్రసంగించారు.

పేదల సొంతింటి కలను నెరవేర్చాలనేది చంద్రబాబు సంకల్పమని, దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చౌహాన్‌ స్పష్టం చేశారు. రాష్ట్రానికి మంజూరైన 75 వేల ఇళ్లు సరిపోవని చంద్రబాబు 3 లక్షలు కావాలని సాధించుకున్నారని, ఇప్పుడు 6 లక్షల ఇళ్లు కావాలని అడగడంతో తాను అంగీకరించానని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలుస్తుందని ఆయన అభివర్ణించారు.

దార్శనికుడు చంద్రబాబు నేతృత్వంలో ఏపీ షైనింగ్‌ ఆంధ్రా, అడ్వాన్స్‌డ్‌ ఆంధ్రా, అచీవింగ్‌ ఆంధ్రాగా మారుతోందని కొనియాడారు. ఇకపై ఏపీ ‘సర్వైవింగ్‌ స్టేట్‌’ కాదని, ప్రగతి పథంలో వెలిగిపోయే ‘షైనింగ్‌ స్టేట్‌’గా రూపాంతరం చెందుతోందని చెప్పారు. దూరదృష్టితో రాష్ట్రాన్ని గ్లోబల్‌ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారని, కృత్రిమ మేధ (ఏఐ), డేటా సెంటర్లు, క్వాంటం టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, అధునాతన తయారీ రంగాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందన్నారు. ఏపీని 360 డిగ్రీల కోణంలో చంద్రబాబు, ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తున్నారని, ఇతర రాష్ట్రాలు చంద్రబాబును ఆదర్శంగా తీసుకుంటున్నాయని పేర్కొన్నారు.

గత కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని రాజధాని లేని స్థితిలో వదిలిపెట్టిందని, జగన్‌ మూడు రాజధానుల పేరుతో అభివృద్ధిని ఆలస్యం చేశారని చౌహాన్‌ విమర్శించారు. కేంద్రం ఇళ్లు మంజూరు చేసినా గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకుండా పేదల సొంతింటి కలను చెరిపేసిందని దుయ్యబట్టారు. ఆ నిధులను సక్రమంగా వినియోగించి ఉంటే ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యేదని అన్నారు.

‘తెలుగు భాష తేనె కన్నా తీయనిది’ అంటూ చౌహాన్‌ తెలుగులో మాట్లాడి రాష్ట్ర ప్రజలకు, పుణ్యభూమికి కోటి ప్రణామాలు తెలిపారు. తెనాలి నేల విజ్ఞానం, కళలు, సంప్రదాయాలు, ప్రతిభకు మారుపేరని కొనియాడారు. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ నిబద్ధతను అభినందించారు. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు లక్‌పతిదీదీ కార్యక్రమం చేపట్టామని, అక్టోబర్‌ 15న విజయవాడలో సరస్‌ మేళా అట్టహాసంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తాను మధ్యప్రదేశ్‌కే కాదు ఏపీకి కూడా మామయ్యనేనని చమత్కరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతో ప్రకృతి సాగులో ఆంధ్రప్రదేశ్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చౌహాన్‌ అన్నారు. బుర్రిపాలెంలో జానకీరామ్‌ రైతు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి అభినందించారు. ఈ పద్ధతిలో ఎకరా వరి సాగుకు రూ.7 వేలు ఖర్చవుతుండగా, రసాయన ఎరువులతో రూ.25 వేలు అవుతుందని రైతు వివరించారు. సభలో 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో ఇంటికి శంకుస్థాపన కూడా జరిగింది.

ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్, మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎంపీ భాష్యం రామకృష్ణ, గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్‌ తాతయ్యబాబు తదితరులు పాల్గొన్నారు.

Next Story