CM Chandrababu: జంతుబలితో పోస్టర్లపై రక్తం చల్లడం ఏమిటి?.. సమాజాన్ని భయపెట్టడమా?: సీఎం చంద్రబాబు
సమాజాన్ని భయపెట్టడమా?: సీఎం చంద్రబాబు

రౌడీయిజం, రాజకీయ నేరాలకు తావులేదు.. వైకాపా శ్రేణులకు హెచ్చరిక
CM Chandrababu: గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాల వల్ల ప్రజల్లో ఇంకా అశాంతి నెలకొని ఉందని, వైకాపా నాయకులు ఇప్పటికీ రౌడీయిజంపై ఆశలు పెట్టుకుని ఉన్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పుట్టినరోజు వేడుకల పేరుతో పోస్టర్లపై జంతుబలి రక్తం చల్లడం ద్వారా సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేయడం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు సమక్షంలో శుక్రవారం తిరుపతి పోలీసు కవాతు మైదానంలో నిర్మించిన నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గౌరవవందనం స్వీకరించి, సందర్శకుల పుస్తకంలో అభిప్రాయం రాసిన అనంతరం పోలీసులను ఉద్దేశించి ప్రసంగించారు.
వైకాపా హయాంలో తిరుమలను అపవిత్రం చేశారని, భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించిన చంద్రబాబు.. శ్రీవెంకటేశ్వరస్వామి విషయంలో తప్పు చేస్తే ఈ జన్మలోనే శిక్ష పడుతుందని హెచ్చరించారు. తిరుపతి, తిరుమలలో చిన్న అలజడి జరిగినా ప్రపంచ దృష్టి ఆకర్షిస్తుందని, నేరాలు లేని ప్రశాంత నగరంగా తీర్చిదిద్దాలని సూచించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉండటంతో పోలీసులు, టీటీడీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
సాంకేతికతను వినియోగించి రౌడీషీటర్లపై నిఘా పెంచాలని, ఇన్‌విజిబుల్ పోలీసింగ్‌తో పాటు విజిబుల్ పోలీసింగ్ కూడా ఉండాలని సీఎం సూచనలు చేశారు. రాయలసీమలో ముఠాలను అణచివేత చేశానని, తెదేపా నాయకులు పాల్గొన్నా వారిని జైలుకు పంపానని గుర్తు చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెడుతున్న వైకాపా శ్రేణులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాల్లో దొంగతనాలు, దాడులు తగ్గాయని చంద్రబాబు పేర్కొన్నారు. తాను తిరుపతిలోనే పుట్టి పెరిగానని, ప్రతి వీధి తెలుసని చెప్పారు. గంజాయి, మాదకద్రవ్యాల ముఠాలపై తిరుపతి పోలీసులు చూపిస్తున్న చొరవను, ‘నో హెల్మెట్ - నో పెట్రోల్’ కార్యక్రమాన్ని అభినందించారు. నూతన కార్యాలయంలో పచ్చదనం పెంచుతున్న కలెక్టర్, ఎస్పీలను ప్రశంసించారు.

