ఈ రోజు ఏది విత్తుతామో రేపు అదే రెండింతు పండుతుందనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌.జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించారు. గడచిన సంవత్సర కాలంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై వైఎస్‌.జగన్‌ తన ఎక్స్‌ ఖాతాలో తీవ్రంగా స్పందించారు. ప్రధానంగా సాక్షీ టీవీలో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు కృష్ణంరాజు మాట్లాడిన దానిపై జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్‌ చెయ్యడంపట్ల వైఎస్‌.జగన్‌ తీవ్ర ఆక్షేపణ తెలియజేశారు. జగన్‌ తన ఎక్స్‌ ఖాతాలో ఇంకా ఏమన్నారంటే…

ఆంధ్రప్రదేశ్‌ అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా @ncbn గారు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబుగారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుగారిని అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారు.

సహజంగా ఒక డిబేట్‌ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్‌కు ఏం సంబంధం? సహజంగానే ఓ డిబేట్‌లో వక్తలు కొందరు అనుకూలంగానూ, కొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్ట్‌లు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడం లేదా?

ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబుగారు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్‌లను డైవర్ట్‌ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపైనా దాడులు చేయిస్తున్నారు. కొమ్మినేనిగారిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారికాదు. గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టాడు. ఆయన నిష్ప‌క్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014-19 మధ్య ఆ ఛానల్‌పై ( గతంలో, సాక్షి కాదు) ఆంక్షలు విధించారు. ఇప్పుడుకూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్షసాధిస్తున్నారు. కొమ్మినేని గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.

చంద్రబాబుగారూ.. ప్రజలు మీకు ఇచ్చిన అధికారం ఐదేళ్లే. అందులో ఏడాది గడిచిపోయింది. నాలుగేళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సంప్రదాయాలకు నాందిపలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో, రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుందని మర్చిపోకండి… అంటూ వైఎస్‌.జగన్‌ తన ఎక్స్‌ ఖాతాలో సూదీర్ఘంగా స్పందించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story