వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న జనసేన శ్రేణులు

  • మంత్రివర్గ విస్తరణపై ఉలుకూ పలుకు లేని చంద్రబాబు
  • నాగబాబు మంత్రి పదవిపై కిమ్మనని పవన్‌ కళ్యాణ్‌
  • నిరాశలో జనసేన నేతలు, కార్యకర్తలు

ఆంధ్రప్రదేశ్‌ లో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని జనసేన నాయకులు, కార్యకర్తలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు క్యాబినేట్‌ లో ఖాళీగా ఉన్న ఒకే ఒక బెర్త్‌ తమ అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్న కొణిదెల నాగబాబుకు ఎప్పుడు దక్కుతుందా, ఆయన మినిస్టర్‌ నాగబాబు అని ఎప్పుడు పిలిపించుకుంటారా అని జనసేన శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నాయి. నాగబాబు తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ వెనకాల జనసేన పార్టీలో క్రియాశీలం అయిన నాటి నుంచి చట్టసభలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేశారు. మొదటి సారి 201లో నరసాపురం పార్లమెంట్‌ స్ధానం నుంచి పోటీ చేసిన నాగబాబు ఓటమి పాలయ్యారు. అదే ఎన్నికల్లో భీమవరం, గాజువాక అసెంబ్లీ స్ధానాల నుంచి పోటీ చేసిన పవన్‌ కళ్యాణ్‌ కూడా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఆ అనుభవంతో 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో పొత్తు పొట్టుకుని కూటమిగా ఏర్పడి రెండు పార్లమెంట్, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి వంద శాతం స్ట్రైక్‌ రేట్‌ తో అన్ని స్ధానాల్లో గెలుపొందారు. అయితే పొత్తులో భాగంగా ముందుగా జనసేనకు మూడు పార్లమెంట్‌ స్ధానాలు కేటాయించడానికి టీడీపీ అంగీకరించింది. అయితే బీజేపీ తమకు ఆరు ఎంపీ స్థానాలు కావాలని పట్టుబట్టడంతో జనసేన ఒక స్ధానం త్యాగం చేయాల్సి వచ్చింది. దురదృష్ట వశాత్తూ ఆ త్యాగం చేసిన అనకాపల్లి స్థానం నుంచి కొణిదెల నాగబాబు పోటీ చేయాల్సి ఉంది. ఒకవేళ నాగబాబే పోటీ చేసి ఉంటే కూటమి ఊపులో నాగబాబు కూడా ప్రజల చేత నేరుగా ఎన్నికై పార్లమెంట్‌ సభ్యుడైపోయేవారు.

కానీ కూటమి పొత్తులు బీటలు వారకుండా నాగబాబు చేసిన త్యాగానికి ఆ సందర్భంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యసభ సీటు ఇస్తామని చంద్రబాబు ప్రామిస్‌ చేశారు. ఆ తరువాత వైఎస్‌ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేయడంతో రెండు సార్లు రాజ్యసభకు పంపే అవకాశం వచ్చినా సమీకరణల పేరు చెప్పి నాగబాబుకు రాజ్యసభ టిక్కెట్ ఇవ్వకుండా దాటవేశారు. ఈ పరిస్ధితుల్లో కూటమి కీలక భాగస్వామి అయిన జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కు ఎక్కడ కోపం వస్తుందో అని నాగబాబును త్వరలో ఎమ్మెల్సీగా చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు లిఖిత పూర్వకంగా ప్రకటించారు. దీంతో ఇక తమ నాయకుడి సోదరుడు కూడా మంత్రైపోతారని జనసేన శ్రేణులతో పాటు మెగా ఫ్యాన్స్‌ కూడా సంబరాలు చేసుకున్నాయి. అయితే నాగబాబుని మంత్రిని చేస్తానని చంద్రబాబు ప్రకటించి ఏడు నెలలు కావస్తోంది. చివరికి నాగబాబు ఎమ్మెల్సీ అయ్యి కూడా నాలుగు నెలలు పైచిలుకు అయ్యింది. అయినా ఇంత వరకూ చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ ఊసే తీయడం లేదు. దీంతో నాగబాబు మంత్రిపదవి వ్యవహారం సందిగ్ధంలో పడిపోయింది. ఈ పరిణామం జనసేన శ్రేణులను అసహనానికి గురి చేస్తోంది. ఈ విషయంలో చంద్రబాబును ఎంత తప్పు పడుతున్నారో తమ నాయకుడు పవన్‌ కళ్యాణ్‌ ని కూడా జనసేన కార్యకర్తలు అంతే తప్పు పడుతున్నారు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే విషయంలో పవన్‌ కళ్యాణ్‌ సీయం చంద్రబాబుపై ఒత్తిడి తేవడంలేదని జనసేన శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. వాస్తవానికి జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్‌ కళ్యాణ్‌ కంటే ఆయన ప్రోక్సీగా నాగబాబే నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అందుబాటులో ఉంటారు. ఈ కారణంతోనే జనసేన కార్యకర్తలు నాగబాబుకు త్వరగా మంత్రి పదవి దక్కాలని కోరుకుంటున్నారు.

అయితే చంద్రబాబు మాత్రం మంత్రివర్గ విస్తరణ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేస్తారనే విషయంలో ఎటువంటి క్లూ ఇవ్వడం లేదు. అసలు విస్తరణపై ఇంతరకూ కసరత్తు చేసిన దాఖలాలు కూడా లేవు. ఇదే సమయంలో ప్రస్తుతం తన మంత్రివర్గంలో ఉన్న పలువురు మంత్రులపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారని, త్వరలో కొందరు మంత్రులకు ఉద్వాసన చెపుతారని ప్రభుత్వ వర్గాల నుంచి టీడీపీ వర్గాల నుంచి లీకులు వదులుతున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో సంజీవరెడ్డిగారి సవిత, వంగలపూడి అనిత, వాసంశెట్టి సుభాష్‌, అనగాని సత్య ప్రసాద్‌, కొండపల్లి శ్రీనివాసులను మంత్రిమండలి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. వారిని తప్పించే క్రమంలో మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడు తమ నాయకుడి సోదరుడు నాగబాబుకు మంత్రివర్గంలో బెర్త్‌ దక్కడం ఖాయమని జనసేన శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం మంత్రివర్గ విస్తరణ విషయంలో ఇంతవరకూ తన మనసులోని మాటను బయటపెట్టడం లేదు. మంత్రివర్గ విస్తరణ జరిగినా కూడా నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చి చంద్రబాబు తాను ఇచ్చిన మాటను ఎంత వరకూ నిలబెట్టుకుంటారనే సందేహం జనసేన నాయకులను, కార్యకర్దలను తొలిచెస్తోంది. ఒకవేళ చంద్రబాబు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వకపోతే తమ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ రియాక్ట్‌ అవుతారా లేక ఎప్పటిలాగే చంద్రబాబు చర్యలకు మద్దతు తెలుపుతారా అన్న సందిగ్ధంతో జనసేన శ్రేణులు టెన్షన్‌ పడిపోతున్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story