Data Powerhouse : విశాఖకు డేటా పవర్‌హౌస్ వస్తుందా?
లోకేష్, ఎస్.టి. టెలిమీడియా భేటీతో భారీ ఆశలు!

ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ విప్లవానికి మరో కొత్త అవకాశం తెరపైకి వచ్చింది. సింగపూర్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, ఎస్.టి. టెలిమీడియా ఇన్వెస్ట్‌మెంట్స్ (ఇండియా) హెడ్ రీతూ మెహ్లావత్‌తో కీలక భేటీ జరిపారు. ఈ సమావేశం పర్యవసానంగా, విశాఖపట్నాన్ని దేశంలోనే ఒక అగ్రగామి "డేటా సిటీ"గా తీర్చిదిద్దే ప్రయత్నాలకు శుభారంభం కావచ్చని బలమైన ఆశలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భేటీలో మంత్రి లోకేష్, విశాఖపట్నంలో అత్యాధునిక గ్రీన్ ఎనర్జీ ఆధారిత డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఎస్.టి. టెలిమీడియాకు ప్రతిపాదించారు.
భారతదేశంలో తమ కార్యకలాపాలను రెట్టింపు చేయాలని సంస్థ భావిస్తున్నందున, డేటా సెంటర్ల స్థాపనకు విశాఖపట్నం అన్ని విధాలా అనుకూలమని లోకేష్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో లభించే స్థలం, మౌలిక సదుపాయాలు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డేటా సెంటర్‌కు సరిపోతాయని ఆయన వివరించారు. అత్యాధునిక కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో బలమైన డిజిటల్ ఎకో సిస్టం నిర్మించడానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని లోకేష్ ఎస్.టి. టెలిమీడియాను కోరారు.
మంత్రి లోకేష్ ప్రతిపాదనలకు రీతూ మెహ్లావత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె తమ సంస్థ భారత దేశంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యకలాపాలను వివరించారు. ప్రస్తుతం భారత్‌లో 10 ప్రధాన నగరాల్లో 30 డేటా సెంటర్లను 311 మెగావాట్ల క్రిటికల్ ఐటీ లోడ్‌తో నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో తమ డేటా సెంటర్ల సామర్థ్యాన్ని 550 మెగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను తమ సంస్థ ఉన్నత స్థాయి బృందం దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రీతూ మెహ్లావత్ హామీ ఇచ్చారు.
సింగపూర్‌ను ప్రధాన కేంద్రంగా కలిగిన ఎస్.టి. టెలిమీడియా, సింగపూర్ ప్రభుత్వ యాజమాన్యంలోని టెమాసెక్ హోల్డింగ్స్‌కు అనుబంధ సంస్థ. కమ్యూనికేషన్స్, మీడియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ (ICT), డేటా సెంటర్లు వంటి రంగాలలో ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ డేటా సెంటర్ ఆపరేటర్‌లలో ఒకటిగా పేరుగాంచింది. భారతదేశంలో ఇది STT GDC India పేరుతో కార్యకలాపాలు సాగిస్తోంది.
అనుకున్న విధంగా ఎస్.టి. టెలిమీడియా విశాఖకు వస్తే, రాష్ట్రానికి అత్యాధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలు లభిస్తాయి. విశాఖపట్నం ప్రత్యేకంగా ఒక శక్తివంతమైన డేటా హబ్‌గా రూపుదిద్దుకుంటుంది. తద్వారా భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
