Ashok Gajapathi Raju: గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు తన కుటుంబ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా రికార్డుల్లో మార్చి, వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో ఆ పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రైవేటు స్థలం అని రుజువు చేసే అన్ని రికార్డులు తన వద్ద ఉన్నాయని, ఒక రాజకీయ పార్టీకి ఎలా లీజు ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

విజయనగరంలో సోమవారం విలేకరులతో మాట్లాడిన అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ, "విజయనగరం రింగు రోడ్డు సమీపంలోని సర్వే నంబరు 569లో మా కుటుంబానికి చెందిన స్థలం ఉంది. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక 2021 అక్టోబరు నుంచి 2022 ఫిబ్రవరి మధ్య రికార్డులు మార్చారు. దీనిని వదిలిపెట్టిన ఆస్తిగా చూపించి, ఎవరినీ సంప్రదించకుండా అధికారులను మభ్యపెట్టి వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించారు. తొలుత రెండెకరాలు శాశ్వతంగా, తర్వాత లీజు కింద ఎకరం న్నర, చివరగా ఒక ఎకరం ఇచ్చారు. ఒక మండల స్థాయి అధికారి కనుసన్నల్లో ఈ పనులు జరిగాయి" అని వివరించారు.

ఈ వ్యవహారంపై ఏడాది క్రితం అప్పటి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని, నాలుగు నెలల క్రితం మళ్లీ గుర్తు చేశానని, అయినా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో తనపై తప్పుడు కేసులు బనాయించి, కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేశారని, క్రిమినల్ కేసుతో మూడేళ్లపాటు కోర్టుల చుట్టూ తిరిగానని చెప్పారు. చట్టాలను తుంగలో తొక్కి పార్టీ కార్యాలయం ఎలా నిర్మించారో వివరించాలని నిలదీశారు.

"గవర్నర్ అయ్యే ముందే రాజకీయాలు వదిలేశాను. ఇప్పుడు సొంత ఆస్తులను కూడా వదులుకోవాలని పలువురు చెప్పుతున్నారు. మీ ఇంటికి వచ్చి నా స్థలమంటే మీరు అంగీకరిస్తారా?" అని అధికారులను ప్రశ్నించారు.

ఈ విషయంలో పూర్తి విచారణ జరిపి, న్యాయం చేయాలని అశోక్ గజపతి రాజు కోరారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story