Y. S. Sharmila: ఉక్కు కర్మాగారంపై షర్మిల ఆగ్రహం – ప్రభుత్వాల వైఖరిపై ప్రశ్నలు
ప్రభుత్వాల వైఖరిపై ప్రశ్నలు

Y. S. Sharmila: ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లపై కేంద్రం, రాష్ట్రం చూపుతున్న శ్రద్ధను విశాఖపట్నం ఉక్కు కర్మాగారం పట్ల ఎందుకు చూపడం లేదని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల తీవ్రంగా ప్రశ్నించారు. మిత్తల్ స్టీల్ ప్లాంట్ స్థాపనను స్వాగతిస్తూనే ఆ సంస్థకు రూ.25 వేల కోట్ల రాయితీలు మంజూరు చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.
విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడిన షర్మిల, “32 మంది బలిదానాలు, వేలాది ఎకరాల భూముల త్యాగంతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం పట్ల ప్రభుత్వాలు ఎందుకీ నిర్లక్ష్యం చూపుతున్నాయి?” అని మండిపడ్డారు. ఇప్పటికీ కర్మాగారం సమస్యలు పరిష్కారం కాలేదని, ప్రైవేటీకరణ కత్తి వేలాడుతూనే ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. “ప్రైవేటీకరణ ఉండదని ఏ ఒక్కరు కూడా హామీ ఇవ్వడం లేదు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాకే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీజం పడింది” అని ఆరోపించారు.
సెయిల్‌తో విలీనం చేస్తే సమస్యలు తొలగిపోతాయని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని అడిగినా నిర్లక్ష్యం చూపించిందని షర్మిల విమర్శించారు. “బైలదిల్లా నుంచి ఐరన్ ఓర్ సరఫరా విశాఖ ఉక్కుకు కాకుండా మిత్తల్ కర్మాగారానికి కూడా ఇవ్వబోతున్నారు. విశాఖ ఉత్పత్తికి అవసరమైన ముడి సరకును తగ్గించాలని చూస్తున్నారా?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను ‘జోక్ క్యాలెండర్’గా మార్చేశారని షర్మిల వ్యాఖ్యానించారు. “1.80 లక్షల పోస్టులు ఖాళీగా ఉండగా కేవలం 10 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం ఎలా న్యాయం?” అని ప్రశ్నించారు. గ్రూపు పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు.

