Y. S. Vijayamma: ఎన్‌సీఎల్‌టీ కేసులో సంచలన ఆరోపణలు- చెల్లికి న్యాయం జరగాలని కోరిన వైఎస్ విజయమ్మ
చెల్లికి న్యాయం జరగాలని కోరిన వైఎస్ విజయమ్మ

Y. S. Vijayamma: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ కుటుంబ ఆస్తుల పంపకాల వివాదంపై మీడియాకు అడ్వకేట్ నోటరీ ద్వారా కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలపై పూర్తి స్పష్టత ఇచ్చారు.
ఆస్తుల విషయంలో తన చెల్లెలు వైఎస్ షర్మిల, ఆమె పిల్లలకు జగన్ అన్యాయం చేశారని విజయమ్మ స్పష్టం చేశారు. ‘‘వైఎస్‌ఆర్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు’’ అని ఆమె తెలిపారు.
వైఎస్‌ఆర్ తన ఆస్తులన్నీ నలుగురు మనవలు, మనవరాళ్లకు సమానంగా పంచాలని ఉద్దేశించారని, ఇది ఆయన ఆదేశమని విజయమ్మ పేర్కొన్నారు. ‘‘దగ్గర వాళ్లందరికీ తెలిసిన వాస్తవమిది. ఎంవోయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు దక్కాల్సిందే. షర్మిల హక్కుకు అనుగుణంగానే జగన్ ఎంవోయూ రాశాడు. వాస్తవానికి షర్మిలకు చెందాల్సిన దానికంటే తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్ సహా యెలహంక భూమి కూడా షర్మిలదే. షర్మిలకు ఇప్పటి వరకు ఇచ్చానని చెబుతున్న డబ్బంతా డివిడెండ్ మాత్రమే’’ అని ఆమె వివరించారు.
ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడు, మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశాడని, ఇప్పటికైనా న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నానని విజయమ్మ అన్నారు. ‘‘నిజం ఏమిటో దేవుడికి, నా కొడుక్కి కూడా తెలుసు. దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే’’ అని ఆమె పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు కుటుంబ ఆస్తుల వివాదానికి మరింత ఊపిరి పోసినట్లుగా ఉన్నాయి. ఎన్‌సీఎల్‌టీలో ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

