Minister Nara Lokesh: రూ.100 కోట్ల మనీ దొంగకి వైకాపా నేతల మద్దతు: మంత్రి నారా లోకేశ్
వైకాపా నేతల మద్దతు: మంత్రి నారా లోకేశ్

Minister Nara Lokesh: వైకాపా నేతలు శ్రీవారి సొత్తును కూడా దోచుకున్నారని, రూ.100 కోట్ల పరకామణి దొంగతనం వెనుక ఆ పార్టీ నేతలు ఉన్నారని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వీడియో పోస్ట్ చేసి వెల్లడించారు.
జగన్ ఐదేళ్ల పాలనలో అవినీతి, అరాచకం పెచ్చరిల్లాయని, దొంగలు, మాఫియాలకు ఏపీని కేంద్రంగా మార్చారని లోకేశ్ విమర్శించారు. గనులు, భూములు, అడవులు, వనరులు, ప్రజలను దోచుకున్న జగన్ గ్యాంగ్ చివరకు తిరుమల శ్రీవారి సొత్తును కూడా వదల్లేదని ఆయన ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు, నాటి తితిదే చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతో పరకామణిలో దొంగలు పడి రూ.కోట్ల విలువైన సొత్తు కొల్లగొట్టారని, ఆ డబ్బులు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టి, తిరుపతి నుంచి తాడేపల్లి వరకు వాటాలు అందాయని నిందితులే చెబుతున్నారని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా భక్తులు నమ్మకంతో కట్టిన ముడుపులు, హుండీలో వేసిన కానుకలు రూ.100 కోట్లు దోచుకున్నప్పుడు భూమన చైర్మన్‌గా ఉన్నారని, ఆయన మనుషులు ఈ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేయడానికి యత్నించారని లోకేశ్ తెలిపారు. అధికార అండతో జగన్ గ్యాంగ్ శ్రీవారికి చేయని అపచారం లేదని, లడ్డూను కల్తీ చేయడం, అన్నప్రసాదం భ్రష్టు పట్టించడం, దర్శనాలు అమ్మేసి సామాన్య భక్తులకు దర్శనం దుర్లభం చేశారని విమర్శించారు.
నాడు చంద్రబాబు బతిమాలినా జగన్ వినలేదని, ఏడుకొండలవాడు పవర్‌ఫుల్ అని తెలిసినా పరకామణి దోచేశారని, గుడిలో హుండీ దోచిన పాపాలతో జగన్ గ్యాంగ్ పాపం పండిందని లోకేశ్ అన్నారు. పరకామణి వీడియోలు బయటపడ్డాయని, రేపు నిందితులు వైకాపా పాపాల చిట్టా విప్పబోతున్నారని పేర్కొన్నారు.
