YS Sharmila: యలహంక ఆస్తి వివాదం.. కుమార్తె వివాహం వేరే చోట నిర్వహిస్తాం: వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల

YS Sharmila: బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌కు సంబంధించిన ఆస్తి వివాదం నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె అంజలి వివాహాన్ని ఆ ఇంట్లో నిర్వహించకుండా వేరే ప్రదేశంలో చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌లో కీలక ప్రకటన చేశారు.
యలహంక ఆస్తి విషయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. షర్మిల తన కుమార్తె అంజలి వివాహాన్ని యలహంక ప్యాలెస్‌లో చేయాలని భావించారు. అయితే ఆ ఆస్తి తనదే అని జగన్ వాదిస్తుండటంతో సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో షర్మిల తన పోస్టులో ఇలా అన్నారు:
“యలహంక.. నా బిడ్డల హక్కు. ఆ ఇల్లు మా నాన్న వైఎస్ఆర్ తిరిగిన ఇల్లు కాబట్టే నా కుమార్తె అక్కడే వివాహం చేయాలని కోరింది. సొంత ఇంట్లో వివాహం చేయడం తల్లిదండ్రుల అదృష్టం. తను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేకపోయామని బాధపడుతున్నాం. నా కుమార్తె అంజలి వివాహం వివాదం లేకుండా జరిపించాల్సిన బాధ్యత మాపై ఉంది. ఈ వివాదం దృష్ట్యా యలహంక ఇంట్లో కాకుండా వేరే చోట చేయాలనుకున్నాం.
నాది కాని దాని కోసం ఆశపడే నీచత్వం నాది కాదు. జగన్ సీఎం అయ్యేవరకు యలహంక ప్రాపర్టీ ఉమ్మడిగా ఉంది. ఆస్తుల పంపకాల్లో యలహంక వంద శాతం నాకు, నా పిల్లల భాగానికి వచ్చిందనేది దేవుడి సాక్షిగా నిజం.
”అంజలి వివాహం పెద్దలు కుదిర్చిన సంబంధమని, దాన్ని వివాదరహితంగా నిర్వహించాలని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ అంజలి రెడ్డి - సోమల రఘురామ్‌రెడ్డి పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహిస్తామని ప్రకటించారు. కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.

