YS Jagan: వైఎస్ జగన్: ప్రతి అడుగులోనూ అరాచకత్వమే
ప్రతి అడుగులోనూ అరాచకత్వమే

మొంథా తుఫాను బాధితులను పరామర్శించే పేరుతో నిబంధనలను తుంగలో తొక్కి పర్యటన
ప్రయాణికులకు రోజంతా ఇబ్బందులు.. ట్రాఫిక్ స్తంభన
YS Jagan: మొంథా తుఫాను వల్ల నష్టపోయిన రైతుల సమస్యలను తెలుసుకునేందుకు మంగళవారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించారు. ఈ పర్యటన సమయంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు అనుమతి నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు. భారీ నష్టాలతో ఇబ్బంది పడుతున్న రైతుల వద్దకు వెళ్తూ.. డీజేలు మోగిస్తూ డ్యాన్సులు చేయడం వంటి అరాచకాలు జరిగాయి. అనుమతి ఇచ్చిన ఒక్క షరతును కూడా పాటించకుండా ప్రతి దశలోనూ గందరగోళం సృష్టించారు.
షరతు-1: జాతీయ రహదారిపై గుంపులు గుంపులుగా గుమికూడకూడదు. ప్రజల రాకపోకలకు, రోజువారీ జీవితానికి ఎలాంటి అంతరాయం కలగకూడదు.
ఉల్లంఘన: విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై జగన్ పర్యటన ప్రారంభమైనప్పటి నుంచే సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బెంజ్ సర్కిల్ వద్దకు చేరే సమయానికి సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఉదయం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ట్రాఫిక్‌ను సాధారణ స్థితికి తీసుకురావడానికి చాలా సమయం పట్టింది.
బందరు రహదారిపై పోలీసులు అడ్డుకున్నా బాణసంచా కాలుస్తున్న వైకాపా కార్యకర్తలు
షరతు-2: పర్యటనకు అనుమతి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్‌ఎన్‌గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలి.
ఉల్లంఘన: విజయవాడలో పర్యటన మొదలైనప్పటి నుంచి ప్రతి చోటా ఆగుతూ ముందుకు సాగారు. రైతులను కలిసేందుకు వెళ్తున్నామని చెప్పి, దానిని ఎన్నికల ప్రచార ర్యాలీలా మార్చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ముగియాల్సిన పర్యటన రాత్రి వరకు కొనసాగింది.
షరతు-3: అనుమతి ఉన్న ప్రాంతాల్లో 500 మంది మాత్రమే, 10 వాహనాలు మాత్రమే వెళ్లాలి. ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు.
ఉల్లంఘన: రైతుల వద్దకు వెళ్తూ.. బలప్రదర్శనకు లేదా ప్రచార సభకు జనాన్ని సమీకరించినట్లు తరలించారు. అనుమతికి మించి వాహనాలు ఉండటంతో ఉయ్యూరు మండలం గండిగుంటలో కాన్వాయ్ వాహనాలు ఢీకొని నాలుగు వాహనాలు దెబ్బతిన్నాయి. జాతీయ రహదారి పొడవునా సాధారణ వాహనాలకు దారి ఇవ్వకుండా ద్విచక్ర వాహనాలు అడ్డదిడ్డంగా పరుగులు పెట్టి, హారన్లు మోగిస్తూ ప్రయాణికులను భయపెట్టారు.
షరతు-4: పరిమితికి మించి వాహనాలు, ప్రజలను సమీకరించకూడదు. తొక్కిసలాట జరగకుండా, ప్రజల జీవనానికి ఇబ్బంది కలగకుండా పోలీసు భద్రతా చర్యలను అతిక్రమించకూడదు.
ఉల్లంఘన: పామర్రు మండలం గోపువానిపాలెంలో హైవేపై వైకాపా కార్యకర్తలు ట్రాఫిక్‌ను అడ్డుకోవడంతో పోలీసులు నిబంధనలు పాటించాలని సూచించగా, మాజీ ఎమ్మెల్యే అనిల్ వాగ్వాదానికి దిగారు. 'ఏం చేస్తారో చేయండి, హైవేపైనే ఉంటాం.. పోలీసుల జులుం నశించాలి.. సీఐ డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేశారు. పేర్ని కిట్టు ఆటోల్లో జనాన్ని తరలించడాన్ని పోలీసులు అడ్డుకోగా, ఎస్సైతో గొడవ పడ్డారు. పోలీసులను తోసుకుంటూ ముందుకు పంపారు. జగన్ వాహనం ముందు కారుకు రెండు వైపులా మాజీ మంత్రి పేర్ని నాని, దేవినేని అవినాష్ వేలాడుతూ ప్రయాణించారు.
షరతు-5: డీజేలు వాడటానికి అనుమతి లేదు.. ఏర్పాటు చేస్తే సీజ్ చేస్తాం.
ఉల్లంఘన: పెనమలూరు పరిధిలో గోసాలలో వైకాపా నేతలు డీజేలు ఏర్పాటు చేసి, పాటలు పెట్టి డ్యాన్సులు చేశారు.
డబ్బులు ఇచ్చి.. వాహనాలు అమర్చి...
పర్యటనకు వచ్చిన చాలా మందికి డబ్బులు ఇచ్చి, వాహనాలు పెట్టి తీసుకొచ్చారు. టిఫిన్, భోజనం పెట్టి, మద్యం సీసాలు అందించి భారీ సంఖ్యలో సమీకరించారు. పర్యటన సమయంలో రహదారిని ఆక్రమించి జెండాలు ఊపుతూ హడావుడి చేశారు. 'జై జగన్' అంటూ అరుస్తూ, ఈలలు వేస్తూ, కేకలు పెడుతూ కనిపించారు.
రప్పా రప్పా.. సీఎం సీఎం
ఆకుమర్రు సమీపంలో జగన్ మీడియా సమావేశం ముందు వైకాపా కార్యకర్తలు 'రప్పా రప్పా.. సీఎం సీఎం' అంటూ నినాదాలు చేశారు. పోలీసులను తోసుకుంటూ ముందుకు వెళ్లారు.

