YS Jagan Mohan Reddy: అప్పలరాజుతో జగన్ ములాఖత్ రద్దు.. జైలు వద్ద కుటుంబ సభ్యులను పరామర్శ
కుటుంబ సభ్యులను పరామర్శ

YS Jagan Mohan Reddy: వైఎస్సార్‌సీపీ నేత సీదిరి అప్పలరాజుతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ములాఖత్ రద్దయింది. రోడ్డు ప్రమాదం కేసులో అప్పలరాజు అరెస్టయి శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జైలులో రిమాండ్‌లో ఉన్నారు.
ఆయనతో ములాఖత్‌కు అనుమతి కోరగా, గురువారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య రావాలని జైలు అధికారులు సమయం నిర్ణయించారు. అయితే జగన్ జైలు వద్దకు సాయంత్రం 5 గంటల తర్వాత చేరుకున్నారు. నిర్ణీత సమయం దాటిపోవడంతో ములాఖత్‌ను అధికారులు రద్దు చేశారు. ఆ తర్వాత జైలు వద్దే అప్పలరాజు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు.
మీడియాతో మాట్లాడుతూ, సీదిరి అప్పలరాజు కుమారుడు అనుకోకుండా చేసిన రోడ్డు ప్రమాదంలో కుట్ర కోణం ఎక్కడుందని జగన్ ప్రశ్నించారు. అప్పలరాజు రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. రోడ్డు ప్రమాదాలను కూడా రాజకీయం చేయడం తెదేపాకే చెల్లిందన్నారు. పేదలు, బీసీలంటే సీఎం చంద్రబాబుకు ప్రేమ లేదని, ఓటు బ్యాంకు కోసమే వారిని వాడుకుంటున్నారని విమర్శించారు.

