మామిడి రైతులతో భేటీ కానున్న జగన్

ఈ నెల 9వ తేదీన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్సీపీ అధినేత వైఎస్‌.జగన్మోహనరెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డును సందర్శించి రైతులను కలుసుకోనున్నారు. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న మామిడి రైతులతో ఈ సందర్భంగా వైఎస్‌.జగన్‌ భేటీ అవుతారు. మద్దతు ధరకు మామిడి కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని వైఎస్‌ఆర్‌సీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మామిడి రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్‌.జగన్‌ బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌ యార్డ్ పర్యటన చేస్తున్నారని ఆ పార్టీ నేతలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డిలు తెలిపారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఈ నేతలిద్దరూ సియం ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే రైతులు అగచాట్లు పడుతున్నారని విమర్శించారు. చిత్తూరు జిల్లాలో లక్షల హెక్టార్లలో మామిడి సాగు జరుగుతుందని, అయితే పంటను కొనే వారు లేకపోవడంతో రైతులు మామిడి కాయలను రోడ్ల మీద పారబోస్తున్నారని ఆవేదన చెందారు. మామిడి రైతుల కష్టాలన తెలుసుకుని ప్రభుత్వం మెడలు వంచి గిట్టుబాటు ధర కల్పించేందుకే వైఎస్‌.జగన్‌ బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డ్‌ లో పర్యటించనున్నారని వైసీపీ నేతలు వెల్లడించారు.

చిత్తూరు జిల్లా మామిడి పంటకు ప్రసిద్దిగాంచిందని, ఈ ప్రాంతంలో అనేక పల్ప్‌ పరిశ్రమలు కూడా ఉన్నాయని కానీ ఈ సంవత్సరం దిగుడికి సరైన గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని పెద్దిరెడ్డి అంటున్నారు. రైతుల నుంచి పల్ప్ కొనుగోలు చేయాల్సిన ఫ్యాక్టరీలు గత ఏడాది ఉత్పత్తి చేసిన పల్ప్‌ నిల్వలే అధికంగా ఉండటం వల్ల ఈ ఏడాది మళ్ళీ పల్ప్ ఉత్పత్తి చేస్తే తమకు నష్టం వస్తుందని చెబుతున్నాయి. దీనిలో అధికశాతం పల్ప్ ఫ్యాక్టరీలు కొనుగోళ్ళు నిలిపివేశాయని ఆయన తెలిపారు. ఫలితంగా మార్కెట్‌లో మామిడి కొనేవారు లేక, రైతులు తెచ్చిన పంటను రోడ్ల మీద పారవేసి వెళ్లిపోయే దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ జిల్లాలో 98 శాతం పల్ప్ ఫ్యాక్టరీలు తెలుగుదేశంకు చెందిన వారివే. వారికి చెందిన పల్ప్ ఫ్యాక్టరీలతో కొనుగోళ్లు చేయించలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. దీంతో స్వయంగా మామిడి రైతులను కలిసి, వారి సమస్యలను తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బంగారుపాళ్యెం మార్కెట్‌కు రానున్నారని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు

Updated On 3 July 2025 5:29 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story