కడప ఎంపీ వైయస్ అవినాష్‌ రెడ్డి వెల్లడి

  • మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరిపించాలి..
  • కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలి..
  • అన్నిచోట్లా టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేశారు..
  • అన్ని ఆధారాలతో సహా బయటపెట్టినా ఎన్నికల కమిషన్ స్పందించడం లేదు..
  • వందల సంఖ్యలో బయటి నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు అరాచకం సృష్టించారు..
  • పులివెందుల ఎన్నికల్లో అరాచకాలపై న్యాయ పోరాటం..
  • కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి స్పష్టీకరణ.

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రెండు పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించే రీపోలింగ్‌ను వైయస్ఆర్‌సీపీ బహిష్కరిస్తోందని కడప పార్లమెంట్ సభ్యుడు వైయస్ అవినాష్‌రెడ్డ వెల్లడించారు. పులివెందుల వైయస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లతో టీడీపీ అరాచకం సృష్టిస్తే, కేవలం రెండు బూత్‌ల్లోనే రీ పోలింగ్ నిర్వహించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వేల సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు పులివెందుల ఎన్నికల్లో అరాచకం సృష్టించారని, ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు చూపినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దీనిపై న్యాయపోరాటానికి సిద్దమని వెల్లడించారు. ఇంకా ఆయనేమన్నారంటే...

కడప జిల్లాలోని ఇతర నియోజకవర్గాల నుంచి వేలాది మంది బయటి వ్యక్తులు పులివెందుల మండలంలోకి వచ్చారు. ప్రతి పోలింగ్ బూత్‌ వద్ద కనీసం అయిదు వందల మంది వరకు దొంగ ఓట్లను వేశారు. పోలింగ్ ఏజెంట్లను లోనికి పోనివ్వకుండా దౌర్జన్యం చేసి, పోలింగ్ ఫాంలను చించేయడం, ఓటర్లు బూత్‌లోకి వెళ్ళకుండా వారి వద్ద ఉన్న పోలింగ్ స్లిప్‌లను లాక్కోవడం చేశారు. యధేచ్చగా వారే దొంగ ఓట్లు వేశారు. ఈరోజు తెల్లవారుజామున రెండు బూత్‌ల్లో మాత్రమే రీపోరింగ్‌కు ప్రోసీడింగ్‌ను రిలీజ్ చేశారు. ఇది సరికాదని చెబుతున్నాం. జెడ్పీటీసీ ఎన్నిక జరిగిన మొత్తం పదిహేను బూత్‌ల్లో రీపోలింగ్ జరపాలి, కేంద్ర బలగాల పర్యవేక్షణలో రీపోలింగ్ నిర్వహించాలి. దీనిపై న్యాయస్థానంను కూడా ఆశ్రయిస్తున్నాం. కేవలం రెండు బూత్‌ల్లో మాత్రమే రీపోలింగ్ చేయడం ద్వారా తాము జాగ్రత్తగా పోలింగ్ ప్రక్రియను జరిపామని చెప్పుకునేందుకు ఎన్నికల కమిషనర్ ప్రయత్నిస్తోంది. కానీ పులివెందుల్లోని మొత్తం పదిహేను పోలింగ్ బూత్‌ల్లోనూ దొంగ ఓట్లు వేసుకున్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసుకునే హక్కును కల్పించలేకపోయారు. కనీసం మా ఏజెంట్లు కూడా లోనికి వెళ్ళలేని పరిస్థితి. టీడీపీ కార్యకర్తలు వేల సంఖ్యలో పోలింగ్ కేంద్రాలను చుట్టుముట్టారు. అన్ని ఆధారాలతో సహా బయటపెట్టాం. ఇంత స్పష్టంగా అక్రమాలు జరిగాయని తెలిసి కూడా కేవలం రెండు బూత్‌ల్లోనే రీ పోలింగ్ పెట్టడం డ్రామా కాదా? ఈ రెండు బూత్‌ల్లో మహిళల పేరుతో పురుషులే ఓట్లు వేయడం వల్ల కానీ, లేదా వైయస్ఆర్‌సీపీ కోర్ట్‌ను ఆశ్రయించబోతోంది కాబట్టి చెప్పుకోవడానికి ఏదో చేశామని చూపించుకోవడానికి ఈ రీపోలింగ్‌ను ప్రకటించారు. ఈ రెండు బూత్‌ల రీపోలింగ్‌ను వైయస్ఆర్‌సీపీ బహిష్కరిస్తోంది. గతంలో ఇంత దారుణమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. ఒక కొత్త సంస్కృతిని చంద్రబాబు పరిచయం చేశాడు. ఒక గ్రామంలో ఉన్న వైయస్ఆర్‌సీపీ వారిని ఎదుర్కోవడానికి, పోలింగ్ బూత్‌ల వద్ద జిల్లాలోని టీడీపీ కార్యకర్తలను మోహరింపచేశాడు. ఇది చాలా ప్రమాదకరమైన ఆపరేషన్. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. దీనిని చంద్రబాబు అలవాటుగా మార్చుకునే అవకాశం ఉంది. ఇటువంటి పరిణామాలు ప్రజాస్వామిక స్పూర్తికి విఘాతం కలిగిస్తాయి.

Politent News Web 1

Politent News Web 1

Next Story