Tirumala Tirupati Devasthanams (TTD): తితిదేలో వైకాపా గూఢచారులు!
వైకాపా గూఢచారులు!

Tirumala Tirupati Devasthanams (TTD): రాష్ట్రంలో వైసీపీ అధికారాన్ని కోల్పోయినప్పటికీ, తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో ఆ పార్టీకి చెందిన రహస్య సభ్యులు మాత్రం ఎక్కువగానే ఉన్నారు. దేవస్థానంలో చిన్న విషయం జరిగినా వెంటనే ఆ పార్టీ నేతలకు సమాచారం అందజేస్తున్నారు. తితిదే మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ, 'కోయంబత్తూరులో జీ స్క్వేర్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ తమ ప్రాంగణంలో తిరుమల ఆలయాన్ని నిర్మించాలని గత ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రికి లేఖ రాసింది. సీఎం చంద్రబాబు నాయుడు మౌఖిక ఆదేశాలతో, త్వరలో జరిగే పాలకమండలి సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకోబోతున్నారు. పాలకమండలి ఎజెండాలో 24వ అంశంగా బోర్డు సెల్ దీన్ని చేర్చింది' అని వెల్లడించారు. అయితే, తితిదే పాలకమండలి సమావేశ తేదీ, ఎజెండా ఇంకా ఖరారు కాలేదు. అలాంటిది భూమన ఎలా ముందుగానే ఎజెండా గురించి ప్రస్తావించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎజెండాను బోర్డు సెల్ తయారుచేస్తుంది. తితిదే ఉన్నతాధికారులు పరిశీలన చేసి చర్చిస్తారు. ఈ ప్రక్రియ మీటింగ్‌కు వారం ముందు మొదలవుతుంది. మరి కరుణాకరరెడ్డి ముందుగానే ఎలా తెలుసుకున్నారు? బోర్డు సెల్‌లోని కీలక అధికారులు ఎవరైనా సమాచారం లీక్ చేశారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. తితిదేలో తన వర్గీయులు 2,000 మందికి పైగా ఉన్నారంటూ మూడు నెలల క్రితం భూమన ప్రకటించారు. ఆ మాటలకు తగ్గట్టుగానే దేవస్థానం అంతర్గత విషయాలు ఆయనకు చేరుతున్నట్లు కనిపిస్తోంది. ఇంకా, ఈ తాజా ఎజెండా అంశం చర్చనీయమైంది. భూమన హయాంలోనే బోర్డు సెల్‌లో ఒక కీలక అధికారి నియామకం జరిగిందని కొందరు ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు.
తితిదే ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న భూమన
భూమన కరుణాకరరెడ్డి రెండుసార్లు తితిదే ఛైర్మన్‌గా పనిచేసినప్పటికీ, ప్రస్తుత పాలకవర్గంపై నిరంతరం ఆరోపణలు చేస్తూ హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. స్థానికుడిగా ఉండి కూడా తిరుమల శ్రీవారిని రాజకీయాల్లోకి లాగడం సరికాదని అంటున్నారు. ఆయన హయాంలో తితిదేలో అనేక అక్రమాలు జరిగాయని, అప్పట్లో ఎవరూ ప్రశ్నించలేకపోయారని వాదనలు ఉన్నాయి. ఆ అక్రమాలకు సంబంధించిన విజిలెన్స్ రిపోర్టు ఇంకా పూర్తి కాలేదు. భూమన ఆరోపణలను కూటమి నేతలు ఖండించకపోవడం ఆశ్చర్యకరం.
గోశాలలో గోవులు మరణిస్తున్నాయని ఒకసారి, క్యూ లైన్లలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారంటూ మరోసారి, అలిపిరి వద్ద అసంపూర్ణ విగ్రహం వృథాగా పడి ఉందని ఇంకోసారి... ఇలా తరచూ వివాదాలు సృష్టిస్తూ తితిదేను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు భూమన. ముఖ్యంగా ప్రస్తుత ఛైర్మన్ బి.ఆర్.నాయుడును టార్గెట్ చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. భూమనపై మూడు ఫిర్యాదులు పోలీసులకు ఇచ్చినప్పటికీ, చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
వారంలో 45 మందికి ఉద్వాసన
బి.ఆర్.నాయుడు, తితిదే ఛైర్మన్
తితిదేలో వివిధ స్థాయిల్లోని 45 మంది ఉద్యోగులకు వారం రోజుల్లో ఉద్వాసన చెప్పబోతున్నాం. వివిధ కారణాలతో వారిపై చర్యలు తీసుకుంటాం. కోయంబత్తూరులో శ్రీవారి ఆలయ నిర్మాణానికి జీ స్క్వేర్ కంపెనీ దాత స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. సుమారు 50 ఎకరాల్లో రూ.300 కోట్లతో నిర్మాణం చేపట్టబోతున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్లాన్ ఇవ్వమని మాత్రమే తితిదేను కోరారు.
