నేడు వైయస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం
ఏపీలో నెలకొన్న ప్రస్తుత పరిస్ధితులపై చర్చ

ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్ధాయి సమావేశం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభంకానున్న ఈ సమావేశం వైఎస్‌ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరగనుంది. పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, లోక్‌సభ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులుతో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు అందరూ ఈ సమావేశంలో పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనా వైఫల్యాలతో పాటు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన వైనం.. ప్రతిపక్ష వైయస్సార్‌సీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, దాడులపై సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్ హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండ గట్టాలని వైయస్సార్‌సీపీ భావిస్తోంది. ఆ దిశలో పార్టీ నేతలు, నాయకులకు సమావేశంలో అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేయనున్నారు.
