CM Chandrababu: గ్రూప్-1 మూల్యాంకనంలో వైసీపీ బండారం బట్టబయలు: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 మూల్యాంకనం వ్యవహారంలో వైసీపీ అడ్డంగా దొరికిపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు అర్హులైన అభ్యర్థులను బలి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో చేసిన లంచ్ మీటింగ్‌లో ఈ అంశం చర్చకు వచ్చింది. గ్రూప్-1 జవాబు పత్రాల్లో 97 శాతం డేటా ఎంట్రీ ఆపరేటర్లతో దిద్దించినట్లు వచ్చిన వార్తలపై సీఎం, మంత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీని ఎండగట్టాలని మంత్రులు సీఎంను కోరారు. సిట్ నివేదిక ఆధారంగా గత వైసీపీ ప్రభుత్వం, అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు సహా ఇతర అధికారుల పాత్రపై మరింత లోతైన దర్యాప్తు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
2011లో మహారాష్ట్రలోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు అభ్యర్థులు పోరాటం చేశారని మంత్రులు గుర్తు చేశారు. సిట్ నివేదిక కోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థానం నిర్ణయం ఏమిటో చూద్దామని సీఎం స్పందించారు. గ్రూప్-1 పరీక్షల వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందనే అంశంపై సమాచారం సేకరించేందుకు కొంతమంది పోలీసు అధికారులకు ప్రభుత్వం టాస్క్ ఇచ్చినట్లు తెలిపారు. తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లిన అభ్యర్థులతో మాట్లాడితే పూర్తి సమాచారం వస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించగా, వారితో వెంటనే మాట్లాడి సమాచారం సేకరించాలని సీఎం ఆదేశించారు.
డీఎస్సీలో ఎటువంటి అవకతవకలు జరగలేదని సీఎం స్పష్టం చేశారు. శాసనమండలిలో వైసీపీ ఈ అంశాన్ని లేవనెత్తితే దీటుగా సమాధానం చెప్పాలని, వారు చేసే ప్రతి ఆరోపణకు సాక్ష్యాధారాలతో అగ్రెసివ్‌గా కౌంటర్ ఇవ్వాలని మంత్రులకు సూచించారు. రాజకీయంగా బురద చల్లితే వదిలిపెట్టకుండా బలమైన ప్రతిస్పందన ఇవ్వాలని తేల్చి చెప్పారు.
ఇదే సమావేశంలో రాజధాని అమరావతిలో నిర్మాణాలు ఊపందుకున్నాయని, వరుసగా ప్రారంభోత్సవాలు చేయాలని సీఎం అన్నారు. సైబరాబాద్, హైదరాబాద్ ఓఆర్‌ఆర్, హైటెక్ సిటీ వంటి ప్రాజెక్టుల్లో తన అనుభవాలను మంత్రులతో పంచుకున్నారు.
- Group1ExamsGroup1EvaluationGroup1ExamIrregularitiesAPPSCChandrababuNaiduYSRCPAndhraPradeshAPPoliticsExamScandalEvaluationIrregularitiesSITReportGroup1SITReportCompetitiveExamsGovernmentJobsJobAspirantsExamNewsEducationNewsAPPSCNewsAndhraPradeshNewsPoliticalNewsLatestAPNewsLatestEducationNewsLatestPoliticalNewsLatestTeluguNewsTeluguNewsBreakingNewsLatestNews

