Electric Vehicles : భారత ఆటోమొబైల్ చరిత్రలోనే మహా విప్లవం.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు
సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు

Electric Vehicles : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకీ ప్రజాదరణ, డిమాండ్ విపరీతంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఇవి వాహనాల వినియోగం మరింత ఊపందుకోనుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్(Ind-Ra) ప్రకటించింది. సంస్థ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం.. ఆర్థిక సంవత్సరం 2026లో మొత్తం వాహనాల అమ్మకాల్లో ఇవి వాటా 8.5 శాతంగా ఉండగా, FY27 నాటికి ఇది ఏకంగా 10 నుంచి 12 శాతానికి చేరుకోనుందని అంచనా వేసింది. అంటే రోడ్డుపైకి వచ్చే ప్రతి 10 వాహనాల్లో కనీసం ఒకటి ఎలక్ట్రిక్ వాహనమే ఉండే అవకాశం ఉందన్నమాట.
ఎలక్ట్రిక్ టూ-వీలర్లదే హవా
ఈ భారీ పెరుగుదలలో అత్యధిక వాటా ఎలక్ట్రిక్ టూ-వీలర్ల (స్కూటర్లు, బైక్‌లు)దేనని నివేదిక స్పష్టం చేసింది. FY26లో 6.6 శాతంగా ఉన్న టూ-వీలర్ ఈవీల వాటా, FY27లో 8 నుంచి 10 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. పెట్రోల్ ధరలతో పోలిస్తే నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉండటం, ఇంట్లోనే సులభంగా ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటు ఉండటం, మార్కెట్‌లోకి కొత్త నయా మోడళ్లు నిరంతరం వస్తుండటంతో జనాలు ఈవీ స్కూటర్ల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కస్టమర్లలో నమ్మకం పెరగడం కూడా ఈ సడన్ సేల్స్ గ్రోత్‌కి ప్రధాన కారణం.
ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లలోనూ జోరు
కేవలం టూ-వీలర్లే కాకుండా, ఫోర్-వీలర్ విభాగంలోనూ ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు పుంజుకుంటున్నాయి. FY26 లో 4.4 శాతంగా ఉన్న ఈవీ కార్ల మార్కెట్ వాటా, FY27 నాటికి 6 నుంచి 8 శాతానికి పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీలు అన్ని బడ్జెట్ విభాగాల్లోనూ కొత్త ఈవీ కార్ మోడళ్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టడానికి శరవేగంగా సిద్ధమవుతున్నాయి. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు కూడా ఆప్షన్లు పెరిగి, కార్ల సేల్స్ మరింత పుంజుకోనున్నాయి.
అయితే, సుదూర ప్రయాణాలు చేసే లాంగ్-రేంజ్ ఈవీ వాహనాల వినియోగం పుంజుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని నివేదిక అభిప్రాయపడింది. దీనికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. సాధారణ వాహనాలతో పోలిస్తే లాంగ్ రేంజ్ ఈవీల ప్రారంభ ధర ఎక్కువగా ఉండటం, ఇంకా అన్ని రహదారుల వెంబడి కావాల్సినన్ని ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రాకపోవడం ప్రధాన అడ్డంకులుగా మారాయి. సుదూర ప్రయాణాల్లో బ్యాటరీ డ్రెయిన్ అవుతుందేమోనన్న ఆలోచనతో కొనుగోలుదారులు లాంగ్ రేంజ్ వాహనాల విషయంలో కాస్త వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు.

