BYD : చార్జింగ్ టెన్షన్‌కు గుడ్ బై.. ఏకంగా 1,200 కిమీ రేంజ్ ఇచ్చే బీవైడీ హైబ్రిడ్ కారు వచ్చేస్తోంది
ఏకంగా 1,200 కిమీ రేంజ్ ఇచ్చే బీవైడీ హైబ్రిడ్ కారు వచ్చేస్తోంది

BYD : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు చాలా మంది కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ, లాంగ్ జర్నీలలో ఛార్జింగ్ ఎక్కడ అయిపోతుందో అనే భయం అందరినీ వేధిస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ గ్లోబల్ ఈవీ దిగ్గజం బీవైడీ సరికొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చింది. కేవలం ప్యూర్ ఎలక్ట్రిక్ కార్లకే పరిమితం కాకుండా, పెట్రోల్, బ్యాటరీ కాంబినేషన్‌తో నడిచే వినూత్నమైన హైబ్రిడ్ కార్లను భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే మంగళవారం నాడు కంపెనీ తన అడ్వాన్స్‌డ్ DM-i(డ్యూయల్ మోడ్ ఇంటెలిజెంట్) ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీని అధికారికంగా ఆవిష్కరించింది.
ఎలక్ట్రిక్ మోటార్‌దే ఇక్కడ మెయిన్ రోల్
సాధారణంగా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మెజారిటీ హైబ్రిడ్ కార్లలో పెట్రోల్ ఇంజన్ ప్రాథమికంగా పనిచేస్తుంది, దానికి సాయంగా ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. కానీ బీవైడీ ప్రవేశపెట్టిన ఈ సరికొత్త 'DM-i' టెక్నాలజీ దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ సిస్టమ్‌లో కారు నడవడానికి ప్రధానంగా ఎలక్ట్రిక్ మోటార్ పవర్‌ను ఉపయోగిస్తుంది. లోపల ఉండే పెట్రోల్ ఇంజన్ కేవలం అవసరమైనప్పుడు మాత్రమే కారును ముందుకు నడపడానికి సాయపడుతుంది లేదా బ్యాటరీని ఆటోమేటిక్‌గా ఛార్జ్ చేయడానికి ఒక జనరేటర్‌లా పనిచేస్తుంది. దీనివల్ల నగరాల్లో రోజువారీ ప్రయాణాలు చేసే వారికి పెట్రోల్ ఖర్చు పూర్తిగా తగ్గిపోతుంది.
ఒక్కసారి ఫుల్ చేస్తే 1,200 కిలోమీటర్ల ప్రయాణం
ఈ అత్యాధునిక హైబ్రిడ్ సిస్టమ్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. దీని యొక్క థర్మల్ ఎఫిషియెన్సీ 43.04 శాతంగా ఉండటం వల్ల ఇది విపరీతమైన ఇంధన పొదుపును (Fuel Efficient) ఇస్తుంది. కారు హైవేలపై చాలా వేగంగా వెళ్తున్నప్పుడు, కారులో ఎక్కువ బరువు ఉన్నప్పుడు లేదా బ్యాటరీ ఛార్జింగ్ పూర్తిగా తగ్గిపోయినప్పుడు మాత్రమే ఈ పెట్రోల్ ఇంజన్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. బీవైడీ కంపెనీ క్లెయిమ్ ప్రకారం, ఈ DM-i టెక్నాలజీ ఉన్న కారులో ఒకసారి బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేసి, పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేస్తే ఏకంగా 1,200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. దీనివల్ల లాంగ్ ట్రిప్స్ వేసేటప్పుడు ఛార్జింగ్ స్టేషన్ల కోసం వెతకాల్సిన అవసరమే ఉండదు.
మూడు అద్భుతమైన డ్రైవింగ్ మోడ్స్
కస్టమర్ల డ్రైవింగ్ అవసరాలకు అనుగుణంగా ఈ టెక్నాలజీ మూడు వేర్వేరు మోడ్స్‌లో పనిచేస్తుంది. మొదటిది 'ప్యూర్ ఈవీ మోడ్' (Pure EV Mode).. ఇందులో కారు పెట్రోల్‌తో సంబంధం లేకుండా కేవలం బ్యాటరీ పవర్‌తోనే నడుస్తుంది, ఇది సిటీ ట్రాఫిక్‌కు బెస్ట్ ఆప్షన్. రెండోది 'సిరీస్ హైబ్రిడ్ మోడ్' (Series Hybrid Mode).. ఇందులో పెట్రోల్ ఇంజన్ కేవలం బ్యాటరీకి కావలసిన కరెంట్‌ను మాత్రమే తయారు చేస్తుంది కానీ కారును నేరుగా నడపదు. ఇక మూడోది 'పారలల్ మోడ్' (Parallel Mode).. కారుకు ఎక్కువ పవర్ కావాల్సి వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ మరియు పెట్రోల్ ఇంజన్ రెండూ కలిసి కారును రాకెట్‌లా ముందుకు దూసుకెళ్లేలా చేస్తాయి.
భారత్‌లో భారీ పెట్టుబడులు, విస్తరణ
బీవైడీ కంపెనీకి హైబ్రిడ్ కార్ల తయారీలో చాలా పాత చరిత్ర ఉంది. 2008లోనే జెనీవా మోటార్ షోలో ప్రపంచంలోనే మొట్టమొదటి మాస్ మార్కెట్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు 'BYD F3DM' ను ఈ సంస్థే పరిచయం చేసింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల కంటే ఎక్కువ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్లను విక్రయించిన బీవైడీ, గ్లోబల్ మార్కెట్లో 35 శాతం వాటాను కలిగి ఉంది. ఇండియా విషయానికి వస్తే, ఇప్పటికే 40 నగరాల్లో 48 షోరూమ్‌లతో దూసుకుపోతోంది. దేశంలో రెండు తయారీ ప్లాంట్ల కోసం కంపెనీ దాదాపు 200 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,600 కోట్లు) పెట్టుబడి పెట్టింది. రాబోయే రోజుల్లో ఈ 1200 కిమీ రేంజ్ ఇచ్చే కార్లను ఇండియన్ రోడ్లపైకి తేవడానికి బీవైడీ గట్టిగా ప్లాన్ చేస్తోంది.

