Bajaj Pulsar 125 : బజాజ్ నుంచి కొత్త పల్సర్ 125 రిలీజ్..సామాన్యుడి బడ్జెట్‌లో అదిరిపోయే బైక్
సామాన్యుడి బడ్జెట్‌లో అదిరిపోయే బైక్

Bajaj Pulsar 125 : బజాజ్ ఆటో తన 125సీసీ సెగ్మెంట్‌లో రారాజుగా నిలిచిన పల్సర్ 125ను 2026 ఎడిషన్ కింద అప్‌డేట్ చేసింది. ఈ కొత్త మోడల్‌లో కంపెనీ ప్రధానంగా డిజైన్, లైటింగ్ విభాగాల్లో భారీ మార్పులు చేసింది. ఇప్పటిదాకా హ్యాలోజన్ బల్బులతో వచ్చిన ఈ బైక్‌కు ఇప్పుడు ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్లను జత చేసింది. దీనివల్ల బైక్ లుక్ పెరగడమే కాకుండా, రాత్రి వేళ ప్రయాణించేటప్పుడు రోడ్డుపై వెలుతురు స్పష్టంగా ఉంటుంది. కొత్త గ్రాఫిక్స్, బ్లాక్ గ్రే, బ్లాక్ రేసింగ్ రెడ్ వంటి అట్రాక్టివ్ కలర్స్ బైక్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి.
ధర విషయానికి వస్తే..సింగిల్ సీట్ వేరియంట్ ధరను రూ.89,910 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. కొంచెం స్పోర్టీగా ఉండాలనుకునే వారి కోసం స్ప్లిట్ సీట్ వేరియంట్ రూ.92,046 ధరతో అందుబాటులో ఉంది. పాత మోడల్‌తో పోలిస్తే ధర సుమారు రూ.3,500 పెరిగినప్పటికీ, ఇందులో ఇచ్చిన కొత్త ఫీచర్ల దృష్ట్యా ఇది సరైన ధర అని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ బైక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న బజాజ్ షోరూమ్‌లలో అందుబాటులోకి వచ్చింది.
టెక్నాలజీ పరంగా చూస్తే..ఇందులో ప్రసిద్ధమైన 124.4cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 11.64 bhp పవర్, 10.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో దూసుకుపోవడానికి, కాలేజీ లేదా ఆఫీస్ పనులకు ఈ ఇంజిన్ పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. మైలేజీ పరంగా కూడా పల్సర్ 125 ఎక్కడా తగ్గదు. లీటరుకు 50 నుంచి 55 కిలోమీటర్ల మైలేజీని ఇది ఇస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ వల్ల హైవేల మీద కూడా బైక్ సాఫీగా వెళ్తుంది.
ఫీచర్ల పరంగా 2026 పల్సర్ 125 ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టుగా మారింది. ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ ఉండటంతో, మీ ఫోన్‌కు వచ్చే కాల్స్,మెసేజ్ అలర్ట్‌లను నేరుగా బైక్ స్క్రీన్ మీదే చూసుకోవచ్చు. అంతేకాకుండా, ప్రయాణంలో ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తోంది. ఈ ధరలో స్టైల్, మైలేజీ, టెక్నాలజీ అన్నీ కలిపి కావాలనుకునే వారికి పల్సర్ 125 ఒక బెస్ట్ ఆప్షన్.

