Ducati Monster V2: అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు, స్పోర్టీ లుక్.. భారత మార్కెట్లోకి డుకాటి మోన్స్టర్
భారత మార్కెట్లోకి డుకాటి మోన్స్టర్

Ducati Monster V2: ప్రముఖ ఇటాలియన్ సూపర్ బైక్ తయారీ సంస్థ డుకాటి, తన పాపులర్ స్పోర్ట్స్ బైక్ మోన్స్టర్ సిరీస్‌లో నూతన తరం మోడళ్లయిన మోన్స్టర్ V2, మోన్స్టర్+లను భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేసింది. ఎక్స్-షోరూమ్ వద్ద ఈ బైక్ ప్రారంభ ధర రూ. 13.99 లక్షలుగా నిర్ణయించారు. పాత మోడల్‌తో పోలిస్తే ధర పెద్దగా పెరగకపోయినప్పటికీ, మోటార్‌సైకిల్‌లో సాంకేతికపరంగా, డిజైన్ పరంగా, ఇంజిన్ పనితీరులో విప్లవాత్మక మార్పులు చేశారు.
890cc V-ట్విన్ ఇంజిన్, పెర్ఫార్మెన్స్
కొత్త డుకాటి మోన్స్టర్ V2 బైక్‌లో అత్యంత పవర్ఫుల్ 890cc V-ట్విన్ ఇంజిన్‌ను అందించారు. ఇదే ఇంజిన్‌ను డుకాటి మల్టీస్ట్రాడా V2, పాణిగలే V2 మోడళ్లలో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజిన్ 9,000rpm వద్ద 111hp పవర్‌ను, 7,250rpm వద్ద 91.1Nm టాప్-ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ప్రవేశపెట్టిన ఇంటేక్ వేరియబుల్ టైమింగ్ టెక్నాలజీ వల్ల 4,000 నుంచి 9,000rpm శ్రేణిలోనే 80 శాతం టాప్ అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల బైక్ త్వరితగతిన వేగాన్ని పుంజుకోవడమే కాకుండా, విభిన్న రోడ్డు పరిస్థితులలో సజావుగా ప్రయాణిస్తుంది.
తేలికపాటి మోనోకాక్ ఛాసిస్, సీట్ హైట్
కంపెనీ కొత్త అల్యూమినియం మోనోకాక్ ఛాసిస్‌ను ఉపయోగించడం ద్వారా బైక్ మొత్తం బరువును దాదాపు 5 కేజీల వరకు తగ్గించింది. బరువు తగ్గడం వల్ల బైక్ హ్యాండ్లింగ్ మరింత సులభంగా, రిఫైన్డ్‌గా మారింది. బైక్ రైడర్ల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్టాండర్డ్ సీట్ ఎత్తును 815mmగా ఇచ్చారు. అలాగే అదనపు యాక్సెసరీస్ ద్వారా సీటు ఎత్తును 795mm లేదా 775mm వరకు తగ్గించుకునే సౌకర్యం కల్పించారు. సస్పెన్షన్ విషయానికొస్తే, ముందుభాగంలో 43mm Showa USD ఫోర్క్స్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ అమర్చారు.
డిజైన్, కలర్ ఆప్షన్లు, వేరియంట్లు
ఈ మోడల్ Monster, Monster+ అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. రెండింటిలోనూ ఇంజిన్, మెకానికల్ భాగాలు ఒకేలా ఉన్నప్పటికీ, మోన్స్టర్+ వేరియంట్‌లో ఫ్రంట్ హెడ్‌లైట్ కౌల్, ప్యాసింజర్ సీట్ కవర్ వంటి స్పోర్టీ ఎలిమెంట్స్ అదనంగా వస్తాయి. ఇవి బైక్‌కు మరింత అగ్రెసివ్ లుక్‌ని ఇస్తాయి. ఇవి డుకాటి రెడ్, ఐస్‌బర్గ్ వైట్, స్పోర్ట్ లివరీ కలర్లలో అందుబాటులో ఉన్నాయి. వేరియంట్, రంగును బట్టి రూ. 13.99 లక్షల నుంచి రూ. 14.45 లక్షల వరకు ధరలు ఉంటాయి.
మోడ్రన్ టెక్నాలజీ, మెయింటెనెన్స్:
రైడింగ్ సేఫ్టీ కోసం రైడ్ అండ్ పవర్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, కార్నరింగ్ ABS వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. 5-ఇంచుల TFT డిస్‌ప్లే, ఫుల్ LED లైటింగ్, బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ అందుబాటులో ఉన్నాయి. మెయింటెనెన్స్ భారం తగ్గించేందుకు వాల్వ్ క్లియరెన్స్ చెక్ పరిమితిని 45,000 కిలోమీటర్లకు పెంచగా, సర్వీస్ వ్యవధిని ప్రతి 15,000 కిలోమీటర్లకు లేదా ఏడాదికి ఒకసారిగా నిర్ణయించారు. 2 ఏళ్ల అపరిమిత మైలేజ్ వారంటీతో ఈ బైక్ లభిస్తుంది.

