KTM 200 Duke: భారత బైక్ మార్కెట్లో కేటీఎం బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన 200 డ్యూక్ అప్‌డేటెడ్ మోడల్ టీజర్‌ను విడుదల చేసింది. బైక్ డిజైన్, లుక్స్ పరంగా కొన్ని మార్పులు కనిపిస్తున్నప్పటికీ, డీలర్‌షిప్ వద్ద లీకైన వివరాల ప్రకారం ఇందులో అదిరిపోయే టెక్నాలజీని తీసుకురానున్నారు. పెద్ద మోడల్స్ అయిన 250, 390 డ్యూక్ బైక్‌ల నుంచి కొన్ని కీలక ఫీచర్లను ఈ చిన్న బైక్‌కు బదిలీ చేయడం విశేషం.

క్లచ్‌తో పనిలేకుండా గేర్లు

ఈ కొత్త అప్‌డేట్‌లో అతిపెద్ద హైలైట్ బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ ఫీచర్. దీని ద్వారా రైడర్ క్లచ్ నొక్కాల్సిన అవసరం లేకుండానే పైకి, క్రిందికి గేర్లు మార్చవచ్చు. దీనివల్ల ట్రాఫిక్‌లో లేదా లాంగ్ రైడ్స్‌లో డ్రైవింగ్ అనుభూతి మరింత సులువుగా మారుతుంది. అలాగే రైడ్-బై-వైర్ టెక్నాలజీని జత చేయడం ద్వారా ఎలక్ట్రానిక్ యాక్సిలరేటర్ కంట్రోల్ లభిస్తుంది. ఇది ఇంజిన్ రెస్పాన్స్‌ను మరింత మెరుగుపరుస్తుంది.

తొలిసారిగా ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్స్

కేటీఎం ఈ మోడల్‌లో తొలిసారిగా రెయిన్, స్ట్రీట్ అనే రెండు రైడింగ్ మోడ్స్‌ను అందించే అవకాశం ఉంది. వర్షాకాలంలో లేదా జారుడు రోడ్లపై జారిపోకుండా కాపాడేందుకు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అదనపు భద్రతను ఇస్తుంది. బైక్ హ్యాండ్లింగ్ మరింత ఈజీగా ఉండటానికి సరికొత్త స్విచ్ గేర్‌ను అమర్చారు. ఇవి పెద్ద మోడల్ అయిన 390 డ్యూక్‌ను పోలి ఉంటాయి. భద్రతను, పర్ఫార్మెన్స్‌ను సమన్వయం చేస్తూ ఈ ఫీచర్లను తెస్తున్నారు.

ఇంజిన్ పవర్ సేమ్.. హార్డ్‌వేర్ అప్‌డేట్స్

మెకానికల్ పరంగా చూస్తే ఇందులో పాత 199.5 సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను యథావిధిగా కొనసాగించనున్నారు. ఇది 25 హెచ్‌పీ పవర్, 19.3 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. సస్పెన్షన్ కోసం ముందువైపు డబ్ల్యూపీ యూఎస్‌డీ ఫోర్క్స్, వెనుకవైపు మోనోషాక్ సస్పెన్షన్ ఇస్తారు. గతంలో వచ్చిన అప్‌డేట్ ద్వారా 320 ఎంఎం ఫ్రంట్ బ్రేక్ డిస్క్, తేలికపాటి 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ వంటివి అందించగా, ఇప్పుడు టెక్నాలజీ పరంగా మరింత అప్‌గ్రేడ్ చేస్తున్నారు.

ధర ఎంత ఉండవచ్చు?

ప్రస్తుతం కేటీఎం 200 డ్యూక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.2.05 లక్షలుగా ఉంది. కొత్త ఫీచర్లు, టెక్నాలజీ రావడం వల్ల ధరలో స్వల్పంగా మార్పులు ఉండే అవకాశం ఉంది. అధికారిక ధరల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. మార్కెట్లో బజాజ్ పల్సర్ NS200 వంటి బైక్‌లకు ఇది గట్టి పోటీ ఇస్తుంది. స్పోర్ట్స్ బైక్ లవర్స్‌కు ఈ అప్‌గ్రేడెడ్ వెర్షన్ చక్కటి అనుభూతిని పంచనుంది.

Next Story