Land Rover : ఆఫ్‌రోడింగ్, లగ్జరీ కార్ల విభాగంలో ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ సంస్థ ల్యాండ్ రోవర్, తన మోస్ట్ పాపులర్ మోడల్ డిఫెండర్‎లో సరికొత్త వెర్షన్‌ను ప్రపంచం ముందుకు తెచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో 2026 ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీని కంపెనీ అధికారికంగా ఆవిష్కరించింది. ఈ సరికొత్త 2026 మోడల్‌లో కంపెనీ బాహ్య డిజైన్ పరంగా కొన్ని చిన్నపాటి కాస్మెటిక్ మార్పులు చేయడంతో పాటు, సరికొత్త వర్టెక్స్ అనే లగ్జరీ వేరియంట్‌ను, సరికొత్త 6-సీటర్ ఆప్షన్‌ను, ప్రయాణాలను మరింత సులభతరం చేసే పలు రకాల అప్‌గ్రేడెడ్ యాక్సెసరీలను జోడించింది.

ఈసారి వచ్చిన అప్‌డేట్స్‌లో అందరినీ ఆకట్టుకుంటున్న ప్రధాన అంశం డిఫెండర్ వర్టెక్స్ వేరియంట్. ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలతో పాటు రోడ్లపై వెళ్లేటప్పుడు కారు అల్ట్రా లగ్జరీగా కనిపించాలనుకునే కస్టమర్ల కోసం యాజమాన్యం ప్రత్యేకంగా దీనిని డిజైన్ చేసింది. ఈ వేరియంట్‌లో సరికొత్త ఫ్రంట్ అండ్ రేర్ బంపర్స్, మరింత పెద్దగా కనిపించే ఫ్రంట్ గ్రిల్, కొత్త ఫాగ్ ల్యాంప్స్, కారు బాడీ కలర్‌తో మ్యాచ్ అయ్యే లోయర్ క్లాడింగ్‌ను అందించారు. ఈ మార్పుల వల్ల ఈ ఎస్‌యూవీ రోడ్డుపై మునుపటి కంటే చాలా వెడల్పుగా, మరింత శక్తివంతంగా కనిపిస్తుంది.

ఈ కొత్త డిఫెండర్ వర్టెక్స్ మోడల్‌కు గ్లోస్ బ్లాక్ రూఫ్ స్పాయిలర్, వీల్స్ లోపల పసుపు రంగు బ్రేక్ కాలిపర్స్, వెనుక వైపు పసుపు రంగు రికవరీ హుక్స్, సరికొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్‌ను జత చేశారు. ఇవి కారుకు మంచి స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. అయితే, వర్టెక్స్ వేరియంట్ కొనలేని వారి కోసం ల్యాండ్ రోవర్ ఎక్స్‌టెండెడ్ ఎక్స్‌టీరియర్ ప్యాక్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీని సహాయంతో కస్టమర్లు డిఫెండర్‌కు చెందిన ఇతర సాధారణ వేరియంట్లను కూడా కొనుగోలు చేసి, వాటిని చూడటానికి వర్టెక్స్ మోడల్ లాగా రీడిజైన్ చేయించుకోవచ్చు.

ఫ్యామిలీతో కలిసి లాంగ్ ట్రిప్స్ వెళ్లేవారి కోసం ల్యాండ్ రోవర్ కంపెనీ డిఫెండర్ 110 మోడల్‌లో మొదటిసారిగా 6-సీటర్ సిట్టింగ్ లేఅవుట్‌ను పరిచయం చేసింది. ఈ సరికొత్త సిట్టింగ్ అరేంజ్మెంట్ 2+2+2 ఫార్మాట్‌లో ఉంటుంది. ఇందులో రెండవ వరుసలో ప్రయాణించే వారి కోసం విడివిడిగా ఉండే రెండు లగ్జరీ కెప్టెన్ సీట్లను ఏర్పాటు చేశారు. ఈ సీట్లకు మంచి బాడీ సపోర్ట్, ఆర్మ్‌రెస్ట్‌లు, సీట్లను వెనక్కి వాల్చుకునే సదుపాయం ఉంటుంది. దీనివల్ల మూడవ వరుస సీట్లలోకి వెళ్లడం చాలా సులభంగా మారుతుంది. అంతేకాకుండా, రెండు కెప్టెన్ సీట్ల మధ్య అదనపు స్టోరేజ్ స్పేస్‌ను కూడా అందించారు.

2026 డిఫెండర్ మోడల్‌లో కంపెనీ సర్గస్సో బ్లూ అనే సరికొత్త రాయల్ ఎక్స్‌టీరియర్ కలర్‌ను కూడా పరిచయం చేసింది. అలాగే, హై-పర్ఫార్మెన్స్ ఇచ్చే డిఫెండర్ OCTA వేరియంట్‌లో సరికొత్త టెక్స్చర్డ్ గ్రాఫైట్ ఫినిషింగ్‌తో కూడిన డిజైన్ ఎలిమెంట్స్‌ను ఉపయోగించారు. అడవులు, కొండ ప్రాంతాలలో ఆఫ్‌రోడింగ్ చేయడాన్ని ఇష్టపడే కస్టమర్ల కోసం కంపెనీ నేరుగా ఫ్యాక్టరీ నుండి అమర్చబడే పలు రకాల యాక్సెసరీలను కూడా ఆఫర్ చేస్తోంది. వీటిలో రూఫ్ స్టోరేజ్ సిస్టమ్, సైడ్ గేర్ క్యారియర్, టైర్లలో గాలి తగ్గినప్పుడు వాడుకోవడానికి ఇన్-బిల్ట్ ఎయిర్ కంప్రెసర్, సరికొత్త ఎక్స్‌టీరియర్ స్టైలింగ్ ప్యాకేజీలు ఉన్నాయి.

ఇంజన్ విషయానికి వస్తే.. 2026 ల్యాండ్ రోవర్ డిఫెండర్ లైన్అప్‌లో కొత్తగా 3.0-లీటర్ P380 మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌ను కంపెనీ చేర్చింది. ఇది గరిష్టంగా 375 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. గతంలో 626 bhp పవర్‌ను ఇచ్చే టాప్-ఎండ్ డిఫెండర్ OCTA వేరియంట్ పవర్‌ను ఈసారి 533 bhp కి తగ్గించారు. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ కఠినంగా మారుతున్న ఉద్గార నిబంధనలను పాటించడం కోసమే ఈ పవర్ తగ్గించాల్సి వచ్చిందని కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఈ సరికొత్త 2026 డిఫెండర్ మోడల్స్ దేశాల వారీ ధరలు, ఇంజన్ ఆప్షన్లు, లాంచ్ తేదీల వివరాలను ల్యాండ్ రోవర్ అధికారికంగా వెల్లడించలేదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story