Maruti Baleno : 6 ఎయిర్‌బ్యాగులు.. అదిరిపోయే డిజైన్‌తో రాబోతున్న మోస్ట్ పాపులర్ కారు.. ఇక మార్కెట్లో భూకంపమే
ఇక మార్కెట్లో భూకంపమే

Maruti Baleno : భారతదేశపు అత్యంత ఇష్టమైన ఫ్యామిలీ కార్లలో ఒకటైన మారుతి సుజుకి బలేనో సరికొత్త అవతారంలో మెరవడానికి సిద్ధమవుతోంది. 2026 మోడల్‌గా రాబోతున్న ఈ బలేనో ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుతం దేశీయ రోడ్లపై టెస్టింగ్ దశలో ఉంది. తన సెగ్మెంట్‌లో రారాజుగా వెలుగొందుతున్న ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, ఇప్పుడు మరింత భద్రతతో పాటు అదిరిపోయే డిజైన్ మార్పులతో కస్టమర్ల ముందుకు రాబోతోంది. ముఖ్యంగా హ్యుందాయ్ i20 వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా మారుతి ఈ మోడల్‌ను తీర్చిదిద్దుతోంది.
ఎక్స్‌టీరియర్ డిజైన్
మారుతి సుజుకి బలేనో ఫేస్‌లిఫ్ట్ బయటి రూపురేఖల్లో గణనీయమైన మార్పులు ఉండబోతున్నాయి. ముఖ్యంగా కారు ముందు భాగంలో మరింత వెడల్పైన మరియు స్టైలిష్ గ్రిల్‌ను అమర్చనున్నారు. కొత్త డిజైన్ హెడ్ లైట్లు, అప్‌డేట్ చేసిన బంపర్లు ఈ కారుకు మరింత షార్ప్ లుక్ ఇస్తాయి. సైడ్ ప్రొఫైల్‌లో ఎలాంటి మార్పులు లేకపోయినా, కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ కారుకు స్పోర్టీ అప్పీల్ తెచ్చిపెడతాయి. వెనుక వైపు ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్‌లో కూడా ఇంటర్నల్ అప్‌డేట్స్ ఉండబోతున్నాయి.
ప్రీమియం ఇంటీరియర్, హైటెక్ ఫీచర్లు
లోపల క్యాబిన్ లేఅవుట్ దాదాపు ప్రస్తుత మోడల్ లాగే ఉన్నప్పటికీ, వాడే మెటీరియల్స్, సీట్ల విషయంలో ప్రీమియం క్వాలిటీని మెరుగుపరచనున్నారు. ఇందులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఉండనున్నాయి. అంతేకాకుండా, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే వంటి హై-ఎండ్ ఫీచర్లతో ఈ కారు మార్కెట్లోకి రానుంది. కనెక్టివిటీ ఫీచర్లను కూడా మారుతి మరింత సులభతరం చేస్తోంది.
సేఫ్టీకి పెద్దపీట - 6 ఎయిర్‌బ్యాగులు
మారుతి కార్లలో సేఫ్టీ తక్కువగా ఉంటుందనే అపవాదును చెరిపివేసేలా, ఈసారి బలేనో ఫేస్‌లిఫ్ట్‌లో సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. టాప్ వేరియంట్లలోనే కాకుండా మిడ్ వేరియంట్ల నుంచి కూడా 6 ఎయిర్‌బ్యాగులను స్టాండర్డ్ ఫీచర్‌గా ఇచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు ఏబీఎస్ (ABS) విత్ ఈబీడీ (EBD), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సురక్షితం చేస్తాయి.
ఇంజన్ పవర్, లాంచ్ వివరాలు
ఈ కొత్త బలేనోలో ప్రస్తుతమున్న 1.2-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. ఇది 88 hp పవర్, 113 Nm టార్క్‌ను ఇస్తుంది. అయితే, పర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం ఫ్రాంక్స్ నుంచి తీసుకున్న 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కూడా ఒక ఆప్షన్‌గా ఇచ్చే ఆలోచనలో మారుతి ఉంది. 2026 రెండో అర్థభాగంలో ఈ కారు అధికారికంగా లాంచ్ కావచ్చు. ధర విషయంలో ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

