Maruti Baleno : బలేనో కొత్త వెర్షన్ వచ్చేస్తోంది.. రోడ్లపై టెస్టింగ్ షురూ.. మారుతి సుజుకి భారీ ప్లాన్
రోడ్లపై టెస్టింగ్ షురూ.. మారుతి సుజుకి భారీ ప్లాన్

Maruti Baleno : భారతీయ రోడ్లపై అత్యధికంగా అమ్ముడయ్యే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన మారుతి సుజుకి బలేనో సరికొత్త అవతారంలో రాబోతోంది. 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కోసం మారుతి సుజుకి ఇప్పటికే రోడ్ టెస్టింగ్ ప్రారంభించింది. తొలిసారిగా ఈ కారు రోడ్లపై తిరుగుతూ కెమెరా కంటికి చిక్కింది. అదిరిపోయే డిజైన్ అప్‌డేట్స్, లగ్జరీ ఇంటీరియర్, మైలేజీని పెంచే సరికొత్త హైబ్రిడ్ టెక్నాలజీతో ఈ కారు మార్కెట్లోకి రానుంది. బలేనో ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో షేప్ మారకపోయినప్పటికీ, లుక్ పరంగా చాలా మార్పులు ఉండబోతున్నాయి. ముందు భాగంలో మరింత వెడల్పైన, స్టైలిష్ గ్రిల్ రానుంది. దీనికి తోడు కొత్త డిజైన్‌తో కూడిన హెడ్‌ల్యాంప్స్, రీ-డిజైన్ చేసిన బంపర్ కారుకు మరింత అగ్రెసివ్ లుక్‌ను ఇస్తాయి. పక్క భాగంలో కొత్త అలాయ్ వీల్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వెనుక వైపు ఎల్‌ఈడీ టెయిల్ లైట్ల లోపలి డిజైన్‌ను మార్చి, మరింత మోడ్రన్‌గా రూపొందిస్తున్నారు.
కారు లోపలి ఇంటీరియర్‌ను కూడా మారుతి సుజుకి అప్‌డేట్ చేస్తోంది. మెటీరియల్ క్వాలిటీని పెంచడంతో పాటు కొత్త సీట్ కవర్లు, అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనున్నారు. వైర్‌లెస్ కనెక్టివిటీ ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది. వినియోగదారుల సౌకర్యం కోసం కేబిన్ స్పేస్‌ను మరింత సమర్థవంతంగా వాడుకునేలా మార్పులు చేస్తున్నారు.
కొత్త బలేనోలో రాబోతున్న అతిపెద్ద మార్పు దాని పవర్‌ట్రెయిన్. ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, మారుతి సుజుకి తన సొంత చౌకైన హైబ్రిడ్ సిస్టమ్‌ను ఇందులో ప్రవేశపెట్టబోతోంది. దీనివల్ల కారు మైలేజీ గణనీయంగా పెరుగుతుంది. పెట్రోల్ ధరలు మండుతున్న వేళ, మధ్యతరగతి వారికి ఇది పెద్ద ఊరటనిస్తుంది. దీంతో పాటు సీఎన్జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం, ఫ్రాంక్స్ లో ఉండే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కూడా ఒక వేరియంట్‌లో ఇచ్చే ఛాన్స్ ఉంది.
మారుతి సుజుకి బలేనో ఫేస్‌లిఫ్ట్ 2026 చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా హ్యుందాయ్ i20, టాటా ఆల్ట్రోజ్ వంటి కార్లకు గట్టి పోటీని ఇవ్వనుంది. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు, అద్భుతమైన మైలేజీ కావాలనుకునే వారికి ఈ కారు బెస్ట్ ఆప్షన్ కానుంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు త్వరలోనే మరిన్ని వివరాలతో మన ముందుకు రానుంది.

