Maruti Brezza Facelift : బ్రెజా కొత్త అవతారం.. 6 స్పీడ్ గేర్‌బాక్స్, టర్బో ఇంజిన్‌తో మారుతి సుజుకి మాస్టర్ ప్లాన్
6 స్పీడ్ గేర్‌బాక్స్, టర్బో ఇంజిన్‌తో మారుతి సుజుకి మాస్టర్ ప్లాన్

Maruti Brezza Facelift : భారతీయ రోడ్లపై కింగ్ లా దూసుకుపోతున్న మారుతి సుజుకి బ్రెజా సరికొత్త అవతారంలో మెరిసిపోయేందుకు సిద్ధమవుతోంది. సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పెరుగుతున్న పోటీని తట్టుకోవడానికి, మారుతి సుజుకి ఈ పాపులర్ మోడల్‌కు భారీ అప్‌డేట్స్ ఇస్తోంది. 2026 బ్రెజా ఫేస్‌లిఫ్ట్ పేరుతో రాబోతున్న ఈ కారులో కేవలం డిజైన్ మాత్రమే కాదు, ఇంజిన్, గేర్‌బాక్స్ విషయంలో కూడా ఊహించని మార్పులు ఉండబోతున్నాయి. కొత్త 2026 బ్రెజాలో జరుగుతున్న అతిపెద్ద మార్పు దాని ఇంజిన్. ఇప్పటివరకు కేవలం 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే లభిస్తున్న బ్రెజా, ఇప్పుడు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రాబోతోంది. ఇది 100 PS పవర్, 147.6 Nm టార్క్‌ను అందిస్తుంది. దీనివల్ల కారు పికప్ పెరగడమే కాకుండా, పన్ను రాయితీలు లభించి కారు ధర తగ్గే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా, మారుతి కార్లలో చాలారోజుల తర్వాత మళ్లీ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ఈ మోడల్‌లో ప్రవేశపెడుతున్నారు.
సిఎన్‌జీ ట్యాంక్ కిందకి.. డిక్కీ ఖాళీ
సిఎన్‌జీ కార్లు కొనేవారికి ఉన్న అతిపెద్ద సమస్య బూట్ స్పేస్ లేకపోవడం. ఈ సమస్యకు మారుతి అదిరిపోయే పరిష్కారం కనుగొంది. ఇటీవల లాంచ్ చేసిన విక్టోరిస్ తరహాలోనే, కొత్త బ్రెజాలో కూడా అండర్ బాడీ సిఎన్‌జీ ట్యాంక్ టెక్నాలజీని వాడుతున్నారు. అంటే సిలిండర్లు కారు కింద భాగంలో అమర్చబడతాయి, తద్వారా డిక్కీ మొత్తం ఖాళీగా ఉండి లగేజీ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ ఫీచర్ ఈ సెగ్మెంట్‌లో బ్రెజాను అగ్రస్థానంలో నిలబెట్టనుంది.
హైటెక్ ఫీచర్లు, ఇంటీరియర్
లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే.. కొత్త బ్రెజాలో విక్టోరిస్ SUV తరహాలో 10.1 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండబోతోంది. కొత్త సీట్ కవర్లు, ప్రీమియం డ్యాష్‌బోర్డ్ ట్రిమ్స్, మరిన్ని కలర్ ఆప్షన్లు కారుకు కొత్త లుక్ ఇవ్వనున్నాయి. సేఫ్టీ కోసం లెవల్-2 అడాస్, 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు టాప్ వేరియంట్లలో అందుబాటులో ఉండవచ్చు.
డిజైన్‌లో స్వల్ప మార్పులు
బయట డిజైన్ పరంగా కారు ఆకారం మారకపోయినా, కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన ఫాగ్ ల్యాంప్స్, సరికొత్త అల్లాయ్ వీల్స్ కారుకు ఫ్రెష్ లుక్ ఇస్తాయి. ముఖ్యంగా వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ రావడం వల్ల కారు రాత్రి వేళల్లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ మోడల్ రాబోయే పండగ సీజన్ నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

