Renault Duster : క్రెటాకు భారీ షాక్.. కొత్త డిజైన్, ఫీచర్లతో 2026 రెనాల్ట్ డస్టర్ రీ-ఎంట్రీ
కొత్త డిజైన్, ఫీచర్లతో 2026 రెనాల్ట్ డస్టర్ రీ-ఎంట్రీ

Renault Duster : ఒకప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీలలో ఒకటిగా నిలిచిన రెనాల్ట్ డస్టర్ మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. 2012లో ప్రారంభమైన ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ మొదట్లో బాగా ప్రాచుర్యం పొందింది. అయితే సమయానికి అప్‌డేట్‌లు లేకపోవడం, కొత్త నిబంధనల కారణంగా 2022లో దీనిని నిలిపివేశారు. ఇప్పుడు కంపెనీ సెకండ్ జనరేషన్‌ను దాటవేసి, నేరుగా థర్డ్ జనరేషన్ మోడల్‌ను భారతదేశంలో విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త డస్టర్ 2026 మొదటి రూపాన్ని జనవరి 26, 2026 న విడుదల చేయనున్నారు. ఆ వెంటనే దీని లాంచింగ్ కూడా జరిగే అవకాశం ఉంది.
కొత్త జనరేషన్ డస్టర్ గతంలో కంటే మరింత స్ట్రాంగ్‌గా, మోడ్రన్‌గా, పవర్ఫుల్ లుక్‌లో కనిపిస్తుంది. ఈ ఎస్‌యూవీని కంపెనీ మాడ్యులర్ CMF-B ప్లాట్‌ఫారమ్ పై తయారు చేస్తున్నారు. అంతర్జాతీయ మోడల్ నుంచి స్ఫూర్తి పొందిన డిజైన్‌లో కొత్త ఫ్రంట్ గ్రిల్, రెనాల్ట్ కొత్త లోగో, షార్ప్ LED హెడ్‌ల్యాంప్‌లు, భారీ క్లాడింగ్‌తో కూడిన ఫ్రంట్ బంపర్ ఉంటాయి. పెద్ద ఎయిర్ డ్యామ్, ఉబ్బెత్తుగా ఉండే బోనెట్ లైన్స్, గుండ్రటి ఫాగ్ ల్యాంప్‌లు దీనికి మరింత మస్కులర్ రూపాన్ని ఇస్తాయి. సైడ్ వీక్షణలో డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, వెడల్పాటి ఫెండర్లు, వీల్ ఆర్చ్ క్లాడింగ్, రూఫ్ రెయిల్స్ దీని అగ్రెసివ్ స్టాన్స్‌ను పెంచుతాయి. వెనుక భాగంలో C-ఆకారపు LED టెయిల్‌ల్యాంప్‌లు, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్‌ను ఉపయోగించారు.
కారు లోపలి భాగంలో కంపెనీ ఆల్-బ్లాక్ లేదా డ్యూయల్-టోన్ థీమ్ ఆప్షన్‌ను అందించవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే కొత్త డస్టర్‌లో 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, అర్కామిస్ 3D సౌండ్ సిస్టమ్ వంటివి లభించే అవకాశం ఉంది. సేఫ్టీ కోసం 360-డిగ్రీ కెమెరా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ టెక్నాలజీతో పాటు అనేక ఇతర ప్రీమియం ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.
ఇంజిన్ విషయానికి వస్తే, భారతదేశంలో కొత్త డస్టర్ కేవలం పెట్రోల్ ఆప్షన్‌తో మాత్రమే వస్తుంది. రెనాల్ట్ ఇందులో 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ సుమారు 156 bhp పవర్ ఉత్పత్తి చేయగలదు. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో 6-స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ శక్తివంతమైన ఇంజిన్‌తో 2026 రెనాల్ట్ డస్టర్ తిరిగి రావడం వలన మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.

