Royal Enfield Classic 350 : క్లాసిక్ లుక్‌లో మోడరన్ టచ్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో సరికొత్త ఫీచర్లు
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో సరికొత్త ఫీచర్లు

Royal Enfield Classic 350 : బుల్లెట్ ప్రియులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ సరికొత్త సర్‌ప్రైజ్ ఇచ్చింది. భారతీయ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన మోడల్ క్లాసిక్ 350ను 2026 వర్షన్‌కు అనుగుణంగా సరికొత్త అప్‌డేట్లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. బైక్ పాత వింటేజ్ లుక్‌ను అలాగే ఉంచుతూనే, నేటి తరం రైడర్ల కోసం రెండు మోడరన్ ఫీచర్లను ఇందులో యాడ్ చేసింది. బైక్‌ను మరింత కంఫర్ట్‌గా మార్చేందుకు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌తో పాటు ప్రయాణాల్లో ఫోన్ చార్జింగ్ పెట్టుకోవడానికి వీలుగా ఫాస్ట్ యూఎస్‌బీ టైప్-సి పోర్టును అమర్చింది. అయితే ఈ కొత్త అప్‌డేట్లు కేవలం టాప్ వేరియంట్ అయిన డుయల్-ఛానల్ ఏబీఎస్ మోడళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
రూ. 1.87 లక్షల ప్రారంభ ధర
ధరల విషయానికి వస్తే, సరికొత్త అప్‌డేటెడ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ప్రారంభ ధరను రూ.1.87 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇది బేస్ మోడల్ అయిన సింగిల్-ఛానల్ ఏబీఎస్ రెడ్డిచ్ రెడ్ వేరియంట్ ధర. అయితే ఈ బేస్ వేరియంట్‌లో కొత్తగా వచ్చిన స్లిప్పర్ క్లచ్, టైప్-సి చార్జర్ సదుపాయాలు ఉండవని గమనించాలి. ఇక ఈ ఫీచర్లు ఉన్న డుయల్-ఛానల్ ఏబీఎస్ వేరియంట్ల ప్రారంభ ధర రూ.1.95 లక్షల నుంచి మొదలవుతుంది. ఇందులో టాప్ ఎండ్ మోడల్ అయిన ఎమరాల్డ్ గ్రీన్ డుయల్-ఛానల్ ఏబీఎస్ వేరియంట్ ధర గరిష్టంగా రూ.2.24 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
రైడర్ల కోసం అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లాచ్
కొత్తగా ప్రవేశపెట్టిన అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ ఫీచర్ రోజువారీ బైక్ నడిపేవారికి ఒక వరం లాంటిది. ముఖ్యంగా నగరాల్లోని భారీ ట్రాఫిక్‌లో ప్రయాణించేటప్పుడు పదే పదే క్లచ్ నొక్కాల్సి వస్తుంది. ఈ స్లిప్పర్ క్లచ్ వల్ల క్లచ్ లివర్ చాలా లైట్‌గా మారుతుంది, దీనివల్ల రైడర్ చేతికి శ్రమ తగ్గుతుంది. అంతేకాకుండా, హైవేలపై హై స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు సడన్‌గా గేర్లు డౌన్ చేసినా వెనుక చక్రం లాక్ అవ్వకుండా, బైక్ అదుపు తప్పకుండా ఈ ఫీచర్ కాపాడుతుంది. దీనివల్ల లాంగ్ రైడ్స్ మరింత సేఫ్‌గా, స్మూత్‌గా సాగిపోతాయి.
లాంగ్ జర్నీ చేసేవారికి గుడ్ న్యూస్
ఈ బైక్‌లో గతంలో సాధారణ యూఎస్‌బీ చార్జింగ్ పోర్టు ఉండేది. కానీ ఇప్పుడు దాని స్థానంలో సరికొత్త ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే యూఎస్‌బీ టైప్-సి పోర్టును అందించారు. ఈ రోజుల్లో లాంగ్ రైడ్స్ వెళ్లే బుల్లెట్ రైడర్లు ఖచ్చితంగా మొబైల్ నేవిగేషన్ లేదా బ్లూటూత్ కనెక్టివిటీని వాడుతుంటారు. ప్రయాణంలో మొబైల్ బ్యాటరీ త్వరగా అయిపోకుండా, ఈ కొత్త టైప్-సి పోర్ట్ ద్వారా ఫోన్‌ను చాలా ఫాస్ట్‌గా చార్జ్ చేసుకోవచ్చు. ఆఫీసులకు వెళ్లేవారికి, లాంగ్ టూరింగ్ చేసేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
ఇంజన్ పవర్‌లో మార్పు లేదు
ఈ రెండు కొత్త ఫీచర్లు మినహా బైక్ మెకానికల్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఎంతో నమ్మకమైన మునుపటి 349 సీసీ జే-సిరీస్ సింగిల్ సిలిండర్ ఇంజన్నే ఇందులోనూ కొనసాగించారు. ఈ ఇంజన్ 20.2 బిహెచ్‌పి పవర్‌ను, 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రైడర్లను ఎంతగానో ఆకట్టుకునే బుల్లెట్ సిగ్నేచర్ థంప్ సౌండ్, కంఫర్ట్ రైడింగ్ పొజిషన్, సాంప్రదాయ 19-18 ఇంచుల స్పోక్ వీల్స్ సెటప్ యథాతథంగా ఉన్నాయి. సస్పెన్షన్ కోసం ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపు ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఇచ్చారు. మొత్తానికి క్లాసిక్ 350 లుక్‌కు ఆధునిక టెక్నాలజీ తోడవ్వడం బైక్ లవర్స్‌ను ఎంతగానో ఖుషీ చేస్తోంది.

