Kodiaq vs Fortuner: భారతీయ రోడ్లపై 7-సీటర్ ప్రీమియం ఎస్‌యూవీల సందడి మొదలైంది. ఎన్నాళ్లో వేచిన 2026 స్కోడా కొడియాక్ భారీ మార్పులతో, అంతకంటే భారీ డిస్కౌంట్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సెగ్మెంట్లో రారాజుగా వెలుగుతున్న టయోటా ఫార్చ్యూనర్‌కు చుక్కలు చూపించేలా స్కోడా తన కొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. ధరకు తగ్గ ఫీచర్లు, అదిరిపోయే సేఫ్టీతో వచ్చిన కొడియాక్.. మొండి పట్టుదలతో దూసుకెళ్లే ఫార్చ్యూనర్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ధరలో ఫార్చ్యూనర్‌కు స్కోడా టఫ్ ఫైట్

సాధారణంగా కొత్త మోడల్ వస్తే ధర పెరుగుతుంది, కానీ స్కోడా మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ 2026 కొడియాక్ ధరను ఏకంగా రూ.3 లక్షలు తగ్గించింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.36.99 లక్షలుగా ఉంది. మరోవైపు, టయోటా ఫార్చ్యూనర్ ధర రూ.34.76 లక్షల నుంచి మొదలవుతోంది. ధర పరంగా రెండు కార్లు దాదాపు ఒకే రేంజ్ లో ఉన్నప్పటికీ, లోపల ఉండే లగ్జరీ విషయంలో మాత్రం ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా కనిపిస్తోంది.

ఇంజిన్ పవర్

స్కోడా కోడియాక్‌లో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 201 bhp పవర్, 320 Nm టార్క్‌ను అందిస్తుంది. దీనికి తోడు 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్, ఆల్-వీల్ డ్రైవ్ ఉండటంతో సిటీలో లేదా హైవేపై ప్రయాణం చాలా స్మూత్‌గా, లగ్జరీగా ఉంటుంది. ఇక ఫార్చ్యూనర్ విషయానికి వస్తే, ఇది 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ రాళ్లూ రప్పలపై కూడా అవలీలగా దూసుకెళ్తుంది. ఆఫ్-రోడింగ్ చేయాలనుకునే వారికి ఫార్చ్యూనర్ మొనగాడు అయితే, హైవేపై లగ్జరీగా వెళ్లాలనుకునే వారికి కోడియాక్ కింగ్.

ఫీచర్ల ఖజానా

ఫీచర్ల విషయంలో స్కోడా కోడియాక్ ఒక చిన్నపాటి ప్యాలెస్‌లా ఉంటుంది. ఇందులో మసాజ్ ఫంక్షన్ ఉన్న సీట్లు, భారీ 12.9 ఇంచ్ టచ్‌స్క్రీన్, 13 స్పీకర్ల కాంటన్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్ రూఫ్ వంటి ఎన్నో లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. టయోటా ఫార్చ్యూనర్ లో ఇప్పటికీ 8 ఇంచ్ టచ్‌స్క్రీన్, అనలాగ్ మీటర్లే ఉన్నాయి. ఫార్చ్యూనర్ కేవలం బ్రాండ్ ఇమేజ్, మొండితనం మీద నడుస్తుంటే, కోడియాక్ మాత్రం లేటెస్ట్ టెక్నాలజీతో కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది.

సేఫ్టీలో స్కోడా నంబర్ 1.. ఫార్చ్యూనర్‌లో ఆ లోటు

సేఫ్టీ విషయంలో స్కోడా కొడియాక్ ఒక అడుగు ముందుంది. ఇందులో ఏకంగా 9 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) కూడా ఉంది. లేన్ కీప్ అసిస్ట్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా మారుస్తాయి. టయోటా ఫార్చ్యూనర్‌లో 7 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నప్పటికీ, ఇప్పటికీ ADAS టెక్నాలజీ లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్.

PolitEnt Media

PolitEnt Media

Next Story