రూ. 5.59 లక్షలకే 5-స్టార్ సేఫ్టీ ఎస్‌యూవీ

Tata Punch : టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన కారు పంచ్‎ను భారీ అప్‌డేట్లతో మళ్ళీ మార్కెట్లోకి తెచ్చింది. 2021లో మొదటిసారి లాంచ్ అయినప్పటి నుంచి టాటాకు ఇది గేమ్ చేంజర్ మోడల్‌గా నిలిచింది. ఇప్పుడు మొదటిసారిగా లోపల, బయట అనేక మార్పులు చేసి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ప్రారంభ ధర రూ.5.59 లక్షలు(ఎక్స్-షోరూమ్) కాగా, ఇది సీఎన్జీ విభాగంలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చిన దేశంలోనే మొదటి మైక్రో ఎస్‌యూవీ కావడం విశేషం.

కొత్త టాటా పంచ్ కేవలం 11.1 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులో పాత 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ (88 PS)తో పాటు, కొత్తగా 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కూడా పరిచయం చేశారు. ఇది గరిష్టంగా 120 PS పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. వేగం, పవర్ కోరుకునే యువతకు ఈ టర్బో వేరియంట్ ఒక వరంలా మారనుంది.

కారు లోపలి భాగం ఇప్పుడు చాలా మోడ్రన్‌గా మారింది. 10.25-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. టాటా కొత్త సిగ్నేచర్ స్టైల్ అయిన వెలిగే లోగో గల స్టీరింగ్ వీల్ ఇందులో ఉంది. స్క్రీన్ కింద టచ్ బేస్డ్ ఏసీ కంట్రోల్స్ ఇవ్వడం వల్ల కారు లోపలి భాగం లగ్జరీగా కనిపిస్తోంది. స్మార్ట్ స్టీరింగ్ వీల్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, డిజిటల్ మీటర్, కీ లెస్ ఎంట్రీ, డ్రైవింగ్ మోడ్స్ వంటి ఫీచర్లు బేస్ మోడల్ నుంచే అందుబాటులో ఉన్నాయి.

టాటా కార్లంటేనే సేఫ్టీకి కేరాఫ్ అడ్రస్. కొత్త పంచ్‌లో కూడా అదే భరోసా కనిపిస్తోంది. ఈసారి అన్ని వేరియంట్లలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా ఇచ్చారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఏబీఎస్ (ABS), టైర్ ప్రెజర్ మానిటరింగ్ (TPMS), 360-డిగ్రీ కెమెరా వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా భారత్ ఎన్‌కాప్ క్రాష్ టెస్టులో ఈ కారు 5-స్టార్ రేటింగ్ సాధించింది. కారును 50 కిమీ వేగంతో ఒక ట్రక్కును ఢీకొట్టినట్లు చేసిన పరీక్షలో కూడా కారు బాడీ చెక్కుచెదరకుండా ఉండటం దీని పటిష్టతకు నిదర్శనం.

కొత్త పంచ్ మొత్తం నాలుగు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సెంట్రల్ లాకింగ్, సీట్‌బెల్ట్ రిమైండర్, ఐసోఫిక్స్ మౌంట్స్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు సేఫ్టీని మరింత పెంచుతాయి. టాటా మోటార్స్ ఇప్పటికే ఈ కారు బుకింగ్‌లను ప్రారంభించింది. ఆసక్తి గల కస్టమర్లు తమ సమీప షోరూమ్ లో లేదా ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీ, పవర్ కావాలనుకునే వారికి కొత్త పంచ్ అద్భుతమైన ఎంపిక.

PolitEnt Media

PolitEnt Media

Next Story