Volkswagen : ఏప్రిల్‌లో ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ ఫేస్‌లిఫ్ట్ జాతర.. కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లతో రీ ఎంట్రీ
కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లతో రీ ఎంట్రీ

Volkswagen : భారతీయ రోడ్లపై జర్మన్ ఇంజనీరింగ్ పవర్‌ను పరిచయం చేసిన ఫోక్స్‌వ్యాగన్ టైగూన్, ఇప్పుడు సరికొత్త అవతారంలో మెరిసిపోవడానికి సిద్ధమైంది. 2021లో లాంచ్ అయినప్పటి నుంచి తనదైన స్టైల్, గట్టి బాడీ, అదిరిపోయే టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో కార్ల ప్రేమికులను అలరిస్తున్న టైగూన్, ఇప్పుడు తన మొట్టమొదటి భారీ అప్‌డేట్ అంటే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకువస్తోంది. ఏప్రిల్ 2026లో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ కొత్త మోడల్, మునుపటి కంటే మరింత లగ్జరీగా, టెక్నాలజీతో నిండి ఉండబోతోంది. స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ తరహాలోనే ఇందులో కూడా భారీ మార్పులు ఉంటాయని సమాచారం.
సివిక్ తరహాలో సరికొత్త డిజైన్
ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో అన్నింటికంటే ప్రధానమైన మార్పు దాని ఎక్స్‌టీరియర్ డిజైన్. ముఖ్యంగా కారు ముందు భాగం పూర్తిగా మారిపోనుంది. గ్లోబల్ మార్కెట్‌లో పాపులర్ అయిన ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ నుంచి ప్రేరణ పొంది దీని గ్రిల్, హెడ్‌ల్యాంప్ సెటప్‌ను డిజైన్ చేశారు. హెడ్‌ల్యాంప్‌ల మధ్య LED లైట్ బార్ ఉంటుంది, దాని మధ్యలో వెలిగే VW లోగో కారుకు ఒక హైటెక్ లుక్‌ని ఇస్తుంది. కొత్త బంపర్, పెద్ద ఎయిర్ డ్యామ్, స్టైలిష్ ఫాగ్ ల్యాంప్స్ దీనికి మరింత స్పోర్టీ అప్పీల్‌ను ఇస్తాయి. వెనుక వైపున కూడా అప్‌డేట్ చేసిన LED టెయిల్ లైట్లు, కొత్త అలాయ్ వీల్స్ కారును మరింత ప్రీమియంగా మారుస్తాయి.
లగ్జరీ ఫీచర్ల హంగామా
కారు లోపల లేఅవుట్ పెద్దగా మారకపోయినా, ఫీచర్ల విషయంలో మాత్రం ఫోక్స్‌వ్యాగన్ ఒక మెట్టు పైకి ఎక్కింది. కస్టమర్ల నుంచి ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్న పనోరమిక్ సన్‌రూఫ్ ఇప్పుడు టైగూన్‌లో చేరనుంది. దీనితో పాటు 10.2 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంటాయి. మరీ ముఖ్యంగా, ఇప్పుడు ముందు సీట్లలో మసాజ్ ఫంక్షన్, వెంటిలేషన్ సదుపాయం ఉండబోతోంది. ఇది లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు ప్రయాణికులకు అద్భుతమైన సౌకర్యాన్ని ఇస్తుంది. వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు మునుపటిలాగే కొనసాగుతాయి.
కొత్త గేర్‌బాక్స్.. మెరుగైన పర్ఫార్మెన్స్
ఇంజిన్ పరంగా టైగూన్ తన సత్తా చాటుతూనే ఉంటుంది. ఇందులో 1.0 లీటర్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లే కొనసాగనున్నాయి. ఇవి వరుసగా 115 bhp, 150 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. అయితే, చిన్న ఇంజిన్ (1.0L)తో ఇప్పుడు కొత్తగా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీనివల్ల సిటీ డ్రైవింగ్, మైలేజీ మెరుగుపడతాయి. 1.5 లీటర్ ఇంజిన్ తో మాత్రం మునుపటి లాగే 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ ఉంటుంది. జర్మన్ డ్రైవింగ్ డైనమిక్స్ ఇష్టపడే వారికి ఈ కొత్త అప్‌డేట్ ఒక పండగ లాంటి వార్త.
పోటీ, ధర
ఏప్రిల్ 2026లో లాంచ్ కాబోతున్న ఈ కొత్త టైగూన్, మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, త్వరలో రాబోతున్న టాటా సియెర్రా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఫీచర్లు, డిజైన్ మారడం వల్ల దీని ధర ప్రస్తుత మోడల్ కంటే రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. సేఫ్టీ విషయంలో ఇప్పటికే 5-స్టార్ రేటింగ్ ఉన్న టైగూన్, ఇప్పుడు కొత్త అప్‌డేట్‌తో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో రారాజుగా నిలవాలని చూస్తోంది.

