Kawasaki Ninja 300 : ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ కవాసాకి ఇండియా, తన అత్యంత ప్రజాదరణ పొందిన స్పోర్ట్స్ బైక్ 2027 కవాసాకి నింజా 300ను భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 3.34 లక్షలుగా నిర్ణయించారు. 350కెపాసిటీ లోపు ఉన్న బైక్ విభాగంలో నేటికీ ఏకైక ట్విన్-సిలిండర్ స్పోర్ట్స్ బైక్‌గా నింజా 300 తన ప్రత్యేకతను చాటుకుంటోంది. గతంలో ఈ విభాగంలో యమహా R3, బెనెల్లీ 302R వంటి మోడళ్లు పోటీ ఇచ్చినా, ప్రస్తుతం అవి మార్కెట్‌లో అందుబాటులో లేవు. హీరో, కేటీఎమ్, టీవీఎస్, అప్రిలియా కంపెనీల బైక్‌లు సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుండగా, నింజా 300 మాత్రం ట్విన్-సిలిండర్ సాయంతో రయ్‌రయ్‌మని దూసుకెళ్తుంది.

2027 వర్షన్‌లో మారిన విషయాలేంటి?

కొత్త నింజా 300 లో కంపెనీ పెద్దగా కాస్మోటిక్ మార్పులేవీ చేయలేదు. బైక్‌కు సరికొత్త రూపునిచ్చేందుకు కేవలం చిన్నపాటి అప్‌డేట్లను మాత్రమే జోడించింది. ఇందులో అతిపెద్ద మార్పు ఏమిటంటే, ఈ బైక్‌కు సరికొత్త టైర్ ప్యాటర్న్‎ను అందించారు. బైక్ డిజైన్, ఫ్రేమ్, బాడీ ప్యానెల్స్ మునుపటి మోడల్ మాదిరిగానే కొనసాగుతున్నాయి. రైడర్లకు కొత్త అనుభూతిని అందించడానికే ఈ నయా వర్షన్‌ను తీసుకువచ్చారు.

సింగిల్ కలర్ ఆప్షన్.. క్యాండీ లైమ్ గ్రీన్ క్లోజ్

ఈసారి 2027 కవాసాకి నింజా 300 మోడల్ కేవలం ఒక్క లైమ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే లభించనుంది. నింజా బ్రాండ్‌కు ప్రామాణికమైన ఈ గ్రీన్ కలర్‌పై వైట్, బ్లూ కలర్ స్ట్రైప్స్ అందించారు. ఇవి బైక్ ఫేరింగ్ నుంచి వెనుక సీట్ వరకు వ్యాపించి స్టైలిష్ లుక్‌ను ఇస్తాయి. అయితే గత మోడల్‌లో లభించిన క్యాండీ లైమ్ గ్రీన్ / ఎబోనీ కలర్ వేరియంట్‌ను కంపెనీ నిలిపివేసింది. కస్టమర్లు మరిన్ని కలర్ ఆప్షన్లను ఆశించినప్పటికీ, ప్రస్తుతం ఒకే రంగులో దీనిని విక్రయిస్తున్నారు.

అదే పవర్‌ఫుల్ ఇంజిన్, గేర్‌బాక్స్

ఇంజిన్ విషయానికొస్తే.. ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు. పాత మోడల్‌లో ఉన్న 296cc ప్యారలల్-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్నే ఇందులోనూ ఉపయోగించారు. ఈ పవర్‌ఫుల్ ఇంజిన్ 39 PS పవర్, 26.1 Nm టాక్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. అంతేకాకుండా అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ ఫీచర్ ఉండటం వల్ల టాప్ స్పీడ్‌లో ఉన్నప్పుడు సులభంగా గేర్లు మార్చవచ్చు మరియు బైక్ కంట్రోల్ తప్పకుండా స్థిరంగా ఉంటుంది.

ఫీచర్లు, పర్ఫార్మెన్స్ లెక్కలివే

నింజా 300 మోడల్ విడుదలై చాలా ఏళ్లు అవుతున్నప్పటికీ, నేటికీ ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో డ్యూయల్ ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌లైట్, డిజిటల్ స్పీడోమీటర్, అనాలాగ్ టాకోమీటర్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ (ABS), ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేకులు, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, రియర్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. అయితే ఈ ధరలో మిగతా బైక్‌లు టీఎఫ్‌టీ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ ఇస్తుండగా.. నింజాలో ఇప్పటికీ హాలోజన్ ఇండికేటర్లు, పాతకాలపు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండటం కాస్త అసంతృప్తి కలిగించే అంశం. అయినప్పటికీ, స్మూత్ ఇంజిన్, ట్విన్-సిలిండర్ సౌండ్, రైడింగ్ అనుభూతి కోరుకునే వారికి నింజా 300 బెస్ట్ ఆప్షన్.

PolitEnt Media

PolitEnt Media

Next Story