New Cars Launch : నవంబర్ 15న కొత్త కార్ల జాతర.. మార్కెట్లో యుద్ధం చేసేందుకు రెడీ అవుతున్న కంపెనీలు
మార్కెట్లో యుద్ధం చేసేందుకు రెడీ అవుతున్న కంపెనీలు

New Cars Launch : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో రాబోయే నవంబర్ 15 (శనివారం) ఒక స్పెషల్ రోజు కానుంది. ఆ ఒక్క రోజునే టాటా నుంచి మారుతి వరకు ప్రముఖ కంపెనీల నుంచి దాదాపు ఐదు కొత్త కార్లు లాంచ్ కాబోతున్నాయి. ఈ లాంచ్‌లలో చవకైన ఫేస్‌లిఫ్ట్ మోడల్స్ నుంచి ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీల వరకు ఉన్నాయి. భారతీయ వినియోగదారులను ఆకర్షించనున్న ఈ 5 కొత్త మోడళ్ల ధరలు, ముఖ్యమైన వివరాలు తెలుసుకుందాం.
టాటా మోటార్స్ నుంచి రెండు ఎస్‌యూవీలు
నవంబర్ 15న టాటా మోటార్స్ తమ రెండు ప్రముఖ ఎస్‌యూవీల కొత్త వేరియంట్లను విడుదల చేయనుంది. అందులో ఒకటి టాటా హారియర్. ఇది 5-సీటర్ ఎస్‌యూవీ. దీనికి గ్లోబల్ ఎన్‌క్యాప్ నుంచిఅత్యధికమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఈ కొత్త ఎస్‌యూవీ ధర రూ. 14 లక్షల నుంచి రూ. 25.25 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. రెండోది టాటా సఫారీ ఫేస్ లిఫ్ట్. ఇది 6-సీటర్, 7-సీటర్ ఆప్షన్లలో లభిస్తుంది. హారియర్ మాదిరిగానే, సఫారీకి కూడా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది. ఈ కారు సుమారు లీటరుకు 16.3కిమీ మైలేజ్ ఇస్తుంది. దీని కొత్త వేరియంట్ ధర రూ. 14.66 లక్షల నుంచి రూ. 25.96 లక్షల మధ్య ఉండవచ్చు.
మారుతి సుజుకి నుంచి రెండు కొత్త కార్లు
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కంపెనీ అయిన మారుతి సుజుకి నవంబర్ 15న రెండు ఎస్‌యూవీలను లాంచ్ చేసే అవకాశం ఉంది. మారుతి అత్యంత ప్రజాదరణ పొందిన బ్రెజా కారు అప్‌డేటెడ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ విడుదల కానుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 8.50 లక్షల వరకు ఉండవచ్చు. అలాగే మారుతి గ్రాండ్ విటారా 3-రో (6 లేదా 7-సీటర్) ఆప్షన్‌తో మార్కెట్‌లోకి రానుంది. ఇందులో 1490 cc, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉండవచ్చు. ఈ పెద్ద ఎస్‌యూవీ ధర సుమారు రూ. 14 లక్షల నుంచి ప్రారంభం కావచ్చు.
ఫోక్స్‌వ్యాగన్ టెరాన్
జర్మన్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ కూడా అదే రోజు తమ కొత్త ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. ఫోక్స్‌వ్యాగన్ టెరాన్ 1984 cc పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. ఇది అధిక ధర రేంజులో విడుదల కానుంది, దీని ధర సుమారు రూ.50 లక్షల వరకు ఉండవచ్చు.

