ఈ కారులో 7 అద్భుతమైన ఫీచర్లు..

Maruti Suzuki Victoris:గత కొన్నేళ్లుగా మారుతి తన కొత్త కార్లలో కొన్ని ఫీచర్లను మొదటిసారిగా ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ల వల్ల మారుతి తన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వగలిగింది. ఇప్పటివరకు మారుతి కార్లలో పెద్ద టచ్‌స్క్రీన్, లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి ఫీచర్లు లేవు. కానీ, ఇటీవల మార్కెట్లోకి వచ్చిన మారుతి విక్టోరిస్ ఎస్‌యూవీలో ఈ ఫీచర్లను చేర్చారు. మారుతి సుజుకి విక్టోరిస్‌లో మారుతి కార్లలో మొదటిసారిగా ఉన్న ఏడు ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ యూనిట్

మారుతి సుజుకి విక్టోరిస్​లో 10.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ మొదటిసారిగా చేర్చారు. అయితే, దీని యూజర్ ఇంటర్‌ఫేస్ పూర్తిగా కొత్తది. ఇందులో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఉంది. దీనిలో అలెక్సా ఆటో వాయిస్ ఏఐ, యాప్ స్టోర్‌తో పాటు ఓటీటీ యాప్స్, ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉన్నాయి. విక్టోరిస్​లోని ఫుల్ లోడెడ్ జెడ్‌ఎక్స్ఐ వేరియంట్‌లో ఈ సిస్టమ్‌ను అందించారు. ఈ కారులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కూడా ఉన్నాయి.

అండర్‌బాడీ సీఎన్‌జీ ట్యాంక్

విక్టోరిస్.. మారుతి మొదటి కారు. ఇందులో సీఎన్‌జీ ట్యాంక్‌ను కారు కింద అమర్చారు. దీనివల్ల కారు యజమానులు తమ ఎస్‌యూవీలో లభించే బూట్ స్పేస్‌ను పూర్తిగా ఉపయోగించుకోవచ్చు.

పవర్డ్ టెయిల్‌గేట్

పవర్డ్ టెయిల్‌గేట్ ఫీచర్‌ను మారుతి గతంలో ఇన్విక్టో ఎంపీవీలో కూడా ఇచ్చింది. కానీ, విక్టోరిస్​లో దీన్ని జెశ్చర్ కంట్రోల్‌తో అందించారు. మీరు మీ రెండు చేతులలో లగేజ్ లేదా ఇతర వస్తువులు పట్టుకొని ఉన్నప్పుడు ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. విక్టోరిస్​ ఎస్‌యూవీలోని టాప్ వేరియంట్‌లైన జెడ్‌ఎక్స్ఐ, జెడ్‌ఎక్స్ఐ ప్లస్​లలో ఈ ఫీచర్ ఉంది.

లెవెల్-2 ఏడీఏఎస్

ఈ కారు విడుదల కాకముందు, మారుతి ఈ విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఏడీఏఎస్ టెక్నాలజీని ఇస్తుందని భావించారు. కానీ, ఇటీవల విడుదలైన విక్టోరిస్.. మారుతికి ఈ ప్రీమియం సేఫ్టీ ఫీచర్‌ను అందించిన మొదటి కారుగా నిలిచింది. విక్టోరిస్​లో లెవెల్-2 ఏడీఏఎస్ ఉంది. ఇందులో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, హై-బీమ్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఏడీఏఎస్ సేఫ్టీ టెక్నాలజీ జెడ్‌ఎక్స్ఐ ప్లస్ వేరియంట్‌లో మాత్రమే ఉంది.

10.25-అంగుళాల కంప్లీట్ డిజిటల్ డిస్‌ప్లే

మారుతి గతంలో ఇన్విక్టో, గ్రాండ్ విటారా వంటి కార్లలో కంప్లీట్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఇచ్చింది. కానీ, విక్టోరిస్‌లో మొదటిసారిగా 10.25-అంగుళాల పెద్ద డిస్‌ప్లేను అందించారు. ఇది కారు రేంజ్, ఫ్యూయల్ ఎకానమీ, స్పీడ్, గేర్ పొజిషన్ వంటి సమాచారాన్ని చూపిస్తుంది. ఈ ఫీచర్ జెడ్‌ఎక్స్ఐ, జెడ్‌ఎక్స్ఐ ప్లస్ వేరియంట్‌లలో లభిస్తుంది.

64-రంగుల యాంబియంట్ లైటింగ్

64-రంగుల యాంబియంట్ లైటింగ్ ఫీచర్ మారుతి కార్లలో మొదటిసారిగా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ సాధారణంగా ప్రీమియం, లగ్జరీ కార్లలో ఉంటుంది. ఇప్పుడు మారుతి కూడా విక్టోరిస్ ఎస్‌యూవీలో దీన్ని అందించింది. అయితే, ఇది కేవలం టాప్ వేరియంట్ అయిన జెడ్‌ఎక్స్ఐ ప్లస్‌లో మాత్రమే ఉంది.

ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్

విక్టోరిస్​తో మారుతి తన కార్లలో మొదటిసారిగా 8-స్పీకర్ ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్‌ను అందించింది. ఈ సెటప్‌లో సెంటర్ స్పీకర్, సబ్‌వూఫర్‌తో పాటు డాల్బీ అట్మాస్ సరౌండ్ ఎక్సపీరియన్స్ ఇన్​బిల్ట్ 8-ఛానల్ యాంప్లిఫైయర్ కూడా ఉన్నాయి. ఈ సౌండ్ సిస్టమ్ కేవలం జెడ్‌ఎక్స్ఐ ప్లస్ వేరియంట్‌లో మాత్రమే ఉంది. మారుతి విక్టోరిస్ దీపావళి 2025లో మార్కెట్లోకి వస్తుంది. దీని ధర రూ.9.75 లక్షల నుంచి ప్రారంభం కావచ్చు. ఇది మారుతి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా, టయోటా హై రైడర్, కియా సెల్టోస్, హోండా ఎలివేట్ వంటి కార్లకు పోటీ ఇస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story