Omega Seiki : ఆటోలో ఏసీ.. పైన సన్‌రూఫ్! ఓమెగా సెకి మ్యూజ్ అరాచకం మాములుగా లేదు
ఓమెగా సెకి మ్యూజ్ అరాచకం మాములుగా లేదు

Omega Seiki : భారతదేశ రోడ్లపై తిరిగే ఆటో రిక్షాల రూపురేఖలు త్వరలోనే మారిపోబోతున్నాయి. ఇప్పటివరకు మనం ఎండలో, వానలో కష్టపడుతూ ప్రయాణించే రిక్షాల స్థానంలో.. ఏసీ, సన్‌రూఫ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్న అత్యాధునిక ఎలక్ట్రిక్ రిక్షాలు రాబోతున్నాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓమెగా సెకి తన వినూత్నమైన మ్యూజ్ ఎలక్ట్రిక్ రిక్షా కోసం తాజాగా పేటెంట్ ఫైల్ చేసింది. 2023 ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ప్రదర్శించిన ఈ మోడల్, ఇప్పుడు ఉత్పత్తికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కేవలం రవాణా కోసమే కాకుండా, ప్రయాణికులకు ఒక ప్రీమియం అనుభూతిని అందించడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు.
ఈ రిక్షా డిజైన్ విషయానికి వస్తే.. ఇది సాధారణ ఆటోల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. దీనికి నాలుగు డోర్స్ ఉండటం వల్ల కారులో ప్రయాణిస్తున్న భావన కలుగుతుంది. ముందు భాగంలో పెద్ద విండ్‌షీల్డ్, రౌండ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, లగ్జరీ బస్సుల్లో ఉండేలాంటి పొడవైన రియర్ వ్యూ మిర్రర్లు దీనికి ప్రత్యేక ఆకర్షణను ఇస్తున్నాయి. మొత్తం బాడీ క్లోజ్డ్ గా ఉండటం వల్ల దుమ్ము, ధూళి నుంచి ప్రయాణికులకు రక్షణ లభిస్తుంది. వెనుక భాగంలో సామాన్లు పెట్టుకోవడానికి ప్రత్యేకంగా బూట్ స్పేస్ కూడా కేటాయించారు.
రిక్షా లోపలి భాగం ఒక చిన్న కారును తలపిస్తోంది. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి విలాసవంతమైన ఫీచర్లు ఉన్నాయి. మండుతున్న వేసవిలో కూడా చల్లగా ప్రయాణించడానికి ఏసీ, వెనుక సీట్ల వద్ద ప్రత్యేకమైన ఏసీ వెంట్లను అమర్చారు. వీటన్నింటికీ మించి, పైన ఉన్న సన్‌రూఫ్ ద్వారా ఆకాశాన్ని చూస్తూ ప్రయాణించడం ప్రయాణికులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. డ్రైవర్ కోసం సౌకర్యవంతమైన క్విల్టెడ్ సీటును కూడా డిజైన్ చేశారు.
టెక్నికల్ వివరాల పరంగా చూస్తే.. ఇందులో 8 kWh NMC బ్యాటరీని ఉపయోగించారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 150 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది, అయితే సాధారణ రోడ్లపై 100 కి.మీ వరకు రావచ్చని అంచనా. గంటకు 50 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రిక్షా, కేవలం 4 గంటల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉండటం వల్ల డ్రైవర్లకు నడపడం చాలా సులభం. 950 కిలోల బరువును మోయగల సామర్థ్యం దీని సొంతం. పెట్రోల్ ధరలతో సంబంధం లేకుండా, అత్యంత తక్కువ ఖర్చుతో విలాసవంతమైన ప్రయాణాన్ని అందించే ఈ ఏసీ రిక్షా త్వరలోనే రోడ్లపై సందడి చేయనుంది.

