Top 10 Scooters : రికార్డ్ క్రియేట్ చేసిన హోండా యాక్టివా..అక్టోబర్లో టాప్ 10 స్కూటర్ల అమ్మకాలు ఇవే
అక్టోబర్లో టాప్ 10 స్కూటర్ల అమ్మకాలు ఇవే

Top 10 Scooters : భారతీయ టూ-వీలర్ మార్కెట్‌లో ఎప్పుడూ డిమాండ్ ఉండేవి స్కూటర్లే. క్లచ్, గేర్ బాధ లేకుండా సులభంగా నడపగలిగే ఈ స్కూటర్లను అందరూ ఇష్టపడతారు. తాజాగా అక్టోబర్ 2025 నెలవారీ అమ్మకాల నివేదిక విడుదలైంది. ఈసారి స్కూటర్ల మార్కెట్‌లో పోటీ మరింత పెరిగింది. హోండా యాక్టివా ఎప్పటిలాగే నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్నా, టీవీఎస్ జూపిటర్, బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి మోడల్స్ ఊహించని వేగంతో దూసుకువచ్చి యాక్టివాకు గట్టి పోటీ ఇస్తున్నాయి.
యాక్టివా జోరు, జూపిటర్ దూకుడు
స్కూటర్ మార్కెట్‌లో హోండా యాక్టివా స్థానం గురించి చెప్పనక్కర్లేదు. అక్టోబర్ 2025లో కూడా యాక్టివా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ నెలలో ఏకంగా 3,26,551 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 22.39% ఎక్కువ. మొత్తం స్కూటర్ అమ్మకాల్లో యాక్టివా వాటా 44.29% గా ఉంది. రెండో స్థానంలో టీవీఎస్ జూపిటర్ ఉంది. దీని అమ్మకాలు 1,18,888 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 8.37% పెరిగింది. జూపిటర్ మార్కెట్ వాటా 16.13% ఉంది. యాక్టివాకు జూపిటర్ గట్టి పోటీ ఇస్తూ స్థిరంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
తగ్గిన యాక్సెస్ పుంజుకున్న ఎన్టార్క్
సుజుకి కంపెనీకి చెందిన సుజుకి యాక్సెస్ మూడో స్థానంలో ఉన్నప్పటికీ, దాని అమ్మకాలు కొద్దిగా తగ్గాయి. ఈ నెలలో 70,327 యూనిట్లు అమ్ముడవగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 6% తక్కువ. మరోవైపు, టీవీఎస్ నుంచి వచ్చిన స్పోర్టీ స్కూటర్ టీవీఎస్ ఎన్టార్క్ మంచి పనితీరు కనబరిచింది. ఇది 41,718 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. 4.13% వృద్ధిని నమోదు చేసింది. ఆ తర్వాత హోండా డియో కూడా 36,340 యూనిట్ల అమ్మకాలతో ఐదో స్థానం దక్కించుకొని, 9.53% వృద్ధిని చూపించింది.
సత్తా చాటిన చేతక్, ఐక్యూబ్
సాంప్రదాయ స్కూటర్లకు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా గట్టి పోటీనిస్తున్నాయి. బజాజ్ చేతక్ అమ్మకాలు అక్టోబర్‌లో బాగా పెరిగాయి. దీనికి 34,900 యూనిట్లు అమ్ముడవగా, గత ఏడాదితో పోలిస్తే ఇది 13.89% అధికం. అదే విధంగా టీవీఎస్ ఐక్యూబ్ కూడా వెనుకబడలేదు. దీనికి 31,989 యూనిట్లు అమ్ముడవగా, ఇది 10.60% వృద్ధిని సూచిస్తుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్‌లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాయి.
బుర్గ్‌మ్యాన్, డెస్టిని, రేజడ్ఆర్ అద్భుత వృద్ధి
టాప్-10లో దిగువన ఉన్న స్కూటర్లలో అద్భుతమైన వృద్ధి కనిపించింది. సుజుకి బుర్గ్‌మ్యాన్ 27,058 యూనిట్ల అమ్మకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. దీని అమ్మకాల్లో ఏకంగా 32.13% పెద్ద వృద్ధి నమోదైంది. తొమ్మిదో స్థానంలో ఉన్న హీరో డెస్టిని 125 అయితే ఏకంగా 83.93% రికార్డు వృద్ధి సాధించి 26,754 యూనిట్లు అమ్ముడైంది. ఇక యమహా రేజడ్ఆర్ కూడా 23.23% వృద్ధిని సాధించి 22,738 యూనిట్ల అమ్మకాలతో టాప్-10 లిస్టును పూర్తి చేసింది.

