Electric Vehicles : కిలోమీటరుకు రూ.2.60లే ఖర్చు.. BaaS మోడల్‌తో ఇక ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు చాలా ఈజీ
ఇక ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు చాలా ఈజీ

Electric Vehicles : భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు రోజురోజుకూ ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. అయితే సాధారణ పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల ప్రారంభ ధరలు చాలా ఎక్కువగా ఉండటం సగటు కొనుగోలుదారుడికి పెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు బ్యాటరీ-యాస్-ఏ-సర్వీస్ అనే వినూత్న విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ పద్ధతిలో కారు కొనుగోలు చేసేటప్పుడు బ్యాటరీకి అయ్యే భారీ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీని ప్రత్యేకంగా అద్దెకు ఇస్తారు. ప్రయాణించే ప్రతి కిలోమీటరుకు మాత్రమే నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల కారు ప్రారంభ ధర గణనీయంగా తగ్గిపోతుంది.
కియా సైరోస్ ఈవీ
ప్రముఖ ఆటో దిగ్గజం కియా సంస్థ తమ కొత్త సైరోస్ ఈవీ మోడల్‌ను బాస్ సదుపాయంతో విక్రయిస్తోంది. సాధారణంగా ఈ కారు షోరూమ్ ప్రారంభ ధర రూ.13.49 లక్షలుగా ఉంది. అయితే మీరు బాస్ ప్లాన్‌ను ఎంచుకుంటే దీనిని ఏకంగా రూ.7.99 లక్షల ప్రారంభ ధరకే సొంతం చేసుకోవచ్చు. దీనికి అదనంగా బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు రూ.3.30 చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారు 42kWh, 51.4kWh బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 526 కిలోమీటర్ల సుదీర్ఘ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
ఎమ్‌జీ కామెట్ ఈవీ, టాటా పంచ్ ఈవీ
తక్కువ బడ్జెట్‌లో సిటీ డ్రైవింగ్ కోసం కారు చూస్తున్న వారికి ఎమ్‌జీ కామెట్ ఈవీ మంచి ఎంపిక. దీని సాధారణ ప్రారంభ ధర రూ.7.63 లక్షలు కాగా, బాస్ విధానంలో కేవలం రూ.4.92 లక్షలకే లభిస్తుంది. దీని బ్యాటరీ అద్దె కిలోమీటరుకు రూ.3.20గా నిర్ణయించారు. మరొకవైపు పాపులర్ ఎస్‌యూవీ టాటా పంచ్ ఈవీ బేస్ వేరియంట్ సాధారణ ధర రూ.9.69 లక్షలు ఉండగా, బాస్ మోడల్‌లో రూ.6.49 లక్షలకే వస్తుంది. దీని బ్యాటరీ రెంట్ ఎంతో అందుబాటులో.. అంటే కిలోమీటరుకు కేవలం రూ.2.60 మాత్రమే.
టాటా టియాగో ఈవీ
టాటా మోటార్స్‌కి చెందిన ఫేస్‌లిఫ్ట్ మోడల్ టియాగో ఈవీ కూడా ఈ అద్దె బ్యాటరీ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్ కారు సాధారణ ధర రూ.6.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే బాస్ ప్లాన్ కింద దీనిని రూ.4.69 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. దీని బ్యాటరీకి కూడా కిలోమీటరుకు కేవలం రూ.2.60 చొప్పున ఛార్జ్ చేస్తారు. ఎలక్ట్రిక్ కారును తక్కువ బడ్జెట్‌లో సొంతం చేసుకోవాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు ఇది అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు.
మారుతీ సుజుకీ ఈ-విటారా
మారుతీ సుజుకీ నుంచి వచ్చిన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ-విటారా కూడా బాస్ ఆప్షన్‌తో లభిస్తోంది. ఈ ప్రీమియం ఎస్‌యూవీ సాధారణ ప్రారంభ ధర రూ.15.99 లక్షలు కాగా, బాస్ ప్లాన్ ఎంచుకుంటే ప్రారంభ ధర ఏకంగా రూ.10.99 లక్షలకే లభిస్తుంది. మీరు ఎంచుకునే వేరియంట్‌ను బట్టి బ్యాటరీ అద్దె కిలోమీటరుకు రూ.3.99 నుంచి రూ.4.39 వరకు ఉంటుంది. ఇటువంటి ప్లాన్ల వల్ల ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు రాబోయే రోజుల్లో మరింత పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

