Electric Car Price : ఇక సామాన్యుడి బడ్జెట్లోనే ఎలక్ట్రిక్ కార్లు.. భారీగా తగ్గనున్న సరికొత్త ఈవీల ధరలు
భారీగా తగ్గనున్న సరికొత్త ఈవీల ధరలు

Electric Car Price : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ చాలా వేగంగా పుంజుకుంటోంది. అయితే ఇప్పటివరకు ఈవీ కార్లు కొనాలనుకునే చాలామంది సాధారణ కస్టమర్ల ముందున్న అతిపెద్ద సమస్య వాటి ధర. పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో.. పర్యావరణహిత కార్లు కొనాలని ఆశ ఉన్నప్పటికీ మధ్యతరగతి ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారబోతోంది. ఆటోమొబైల్ కంపెనీలు సామాన్యుడి జేబుకు తగినట్లుగా, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావడానికి రాత్రింబగళ్లు శ్రమిస్తున్నాయి.
టాటా టియాగో ఈవీ సృష్టించిన ట్రెండ్
ఇటీవలి కాలంలో భారత మార్కెట్లోకి వచ్చిన టాటా టియాగో ఈవీ, ఎమ్‌జీ కామెట్, సిట్రోయెన్ ఈసీ3 వంటి కార్లు తక్కువ ధరలోనే అద్భుతమైన ఎలక్ట్రిక్ కార్లను అందించవచ్చని నిరూపించాయి. ఈ కార్లకు కస్టమర్ల నుంచి ఊహించని స్థాయిలో భారీ రెస్పాన్స్ లభించింది. పెరిగిపోతున్న ఇంధన ధరల నుంచి ఉపశమనం పొందడానికి, ఆఫీస్ అవసరాల కోసం రోజువారీ డ్రైవింగ్ ఖర్చులను తగ్గించుకోవడానికి కస్టమర్లు చౌకగా వచ్చే ఎలక్ట్రిక్ కార్ల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారని ఈ కార్ల సక్సెస్ ద్వారా స్పష్టమైంది.
బడ్జెట్ ఈవీల కోసం కంపెనీల పోటీ
ఆటోమొబైల్ రంగానికి చెందిన నిపుణుల అంచనా ప్రకారం.. రాబోయే రోజుల్లో రూ.10 లక్షల కంటే తక్కువ ధరకు, రూ.15 లక్షల లోపు లభించే ఈవీ కార్ల మార్కెట్ భారీగా వృద్ధి చెందనుంది. ఈ బడ్జెట్ పరిధిలో ఎక్కువ ఆప్షన్లు వస్తే, మొదటిసారి కారు కొనేవారికే కాకుండా, ఇంట్లో వాడుకోవడానికి రెండో కారు కోసం చూస్తున్న పెద్ద కుటుంబాలకు కూడా ఇది ఎంతో లాభదాయకంగా మారుతుంది. వినియోగదారులు తమ రోజువారీ రన్నింగ్ కాస్ట్‌ను గణనీయంగా తగ్గించుకోవడానికి ఈ చిన్న బడ్జెట్ ఈవీలు ఎంతగానో ఉపయోగపడతాయి.
ధరలు తగ్గడానికి లోకలైజేషన్ మంత్రం
ఎలక్ట్రిక్ కార్ల ధరలు ఇంతలా తగ్గడానికి ప్రధాన కారణం లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్. ప్రస్తుతం ఈవీ కార్లలో వాడే బ్యాటరీ ప్యాక్, ఇతర కీలక విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల వాటి ఖర్చు విపరీతంగా పెరుగుతోంది. కానీ ఇప్పుడు ప్రముఖ కంపెనీలన్నీ భారతదేశంలోనే స్వయంగా బ్యాటరీ ప్లాంట్లను, విడిభాగాల తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి. దీనివల్ల ఉత్పత్తి వ్యయం భారీగా తగ్గి, కార్ల ధరలు సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి.
మారుతి, హ్యుందాయ్ ల బిగ్ ప్లాన్
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బ్రాండ్లకే కాకుండా.. రాబోయే రోజుల్లో ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి సైతం పెద్ద ఎత్తున బడ్జెట్ ఈవీ సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇవ్వడానికి పక్కా స్కెచ్ వేసింది. మరోవైపు హ్యుందాయ్ సంస్థ కూడా అప్‌కమింగ్ క్రెటా ఈవీ కంటే తక్కువ ధరలో ఉండేలా, సామాన్య మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఒక సరికొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేస్తోంది. కంపెనీల మధ్య పోటీ పెరగడం, స్థానిక తయారీ వల్ల భవిష్యత్తులో ఈవీ కార్లు మరింత చౌకగా మారడం ఖాయం. దీనివల్ల సాధారణ కస్టమర్ల ఎలక్ట్రిక్ కారు కల త్వరలోనే నిజం కాబోతోంది.

