CNG Kit: రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలు, ఈ20 ఇంధనం గురించిన ఆందోళనల నేపథ్యంలో పాత పెట్రోల్ కార్లను సీఎన్‌జీ వాహనాలుగా మార్చే ధోరణి బాగా పెరిగింది. కంపెనీ కంపెనీల నుంచి నేరుగా సీఎన్‌జీ ఆప్షన్ రాని ఎస్‌యూవీలు లేదా పాత కార్ల యజమానులు బయట లభించే ఆఫ్టర్‌మార్కెట్ కిట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కంపెనీ అందించే ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ వెర్షన్ ధరతో పోలిస్తే బయట లభించే ప్రభుత్వ ఆమోదిత కిట్లు 25 నుంచి 30 శాతం తక్కువ ధరకే లభిస్తాయి. ప్రతిరోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది ఆర్థికంగా ఎంతో ఊరట కలిగిస్తుంది.

పవర్‌ట్రెయిన్ వారంటీపై పడే తీవ్ర ప్రభావం

బయట నుంచి సీఎన్‌జీ కిట్ అమర్చడంలో ఉన్న అతిపెద్ద ముప్పు కారు వారంటీ రద్దవ్వడమే. మీరు వాడే కిట్ ప్రభుత్వ గుర్తింపు పొందినదే అయినా, అనుభవజ్ఞులైన టెక్నీషియన్లతో బిగించినప్పటికీ ఇంజిన్ పవర్‌ట్రెయిన్ వారంటీని కంపెనీలు తక్షణమే రద్దు చేస్తాయి. ఇంజిన్ రక్షణకు సంబంధించిన భాగాలు దెబ్బతింటే కంపెనీలు ఎలాంటి బాధ్యత వహించవు. కొన్ని కిట్ సరఫరాదారులు థర్డ్ పార్టీ వారంటీని ఆఫర్ చేస్తున్నప్పటికీ దానికోసం అదనపు రుసుము చెల్లించాల్సి వస్తుంది. పైగా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ కార్లలో ఉండే అండర్‌బాడీ లేదా డ్యూయల్ ట్యాంక్ టెక్నాలజీ బయట లభించకపోవడంతో బూట్ స్పేస్ పూర్తిగా తగ్గిపోతుంది.

ఇన్సూరెన్స్ క్లెయిమ్ రద్దయ్యే ప్రమాదం ఉందా?

బయట సీఎన్‌జీ కిట్ వేయించడం వల్ల కారు ఇన్సూరెన్స్ పాలసీపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. సీఎన్‌జీ కిట్ అమర్చిన వెంటనే ఆ విషయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి అధికారికంగా తెలియజేసి పాలసీలో మార్పులు చేయించడం అత్యంత ఆవశ్యకం. కిట్ అమర్చడం వల్ల కారు ఐడీవీ (ఇన్స్యూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ) పెరుగుతుంది, అగ్నిప్రమాదాల ప్రమాదం కూడా కాస్త పెరుగుతుంది. అందుకే ప్రీమియం స్వల్పంగా పెరుగుతుంది. ఈ సమాచారాన్ని బీమా సంస్థకు తెలియజేయకపోతే, భవిష్యత్తులో ప్రమాదం లేదా అగ్నిప్రమాదం జరిగినప్పుడు క్లెయిమ్ పూర్తిగా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది.

ఆర్టీఓ ఆమోదం పొందే విధానం

కారులో సీఎన్‌జీ కిట్ బిగించిన తర్వాత ఆర్సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్) బుక్‌లో కూడా ఆ మార్పును నమోదు చేయించాలి. స్థానిక ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి అవసరమైన పత్రాలను సమర్పించి, వాహనాన్ని తనిఖీ చేయించి సీఎన్‌జీ ఆమోదాన్ని ఆర్సీలో పొందుపరచాలి. ఆర్సీలో మార్పులు జరగకుండా, ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వకుండా కారు నడిపితే ట్రాఫిక్ చలాన్లతో పాటు విపత్తుల సమయంలో తీవ్ర ఆర్థిక నష్టం చవిచూడాల్సి వస్తుంది. సరైన ప్రాసెస్ పాటిస్తేనే ఆఫ్టర్‌మార్కెట్ సీఎన్‌జీ కిట్ సురక్షితంగా మారుతుంది.

Next Story