Honda Elevate : ఫెస్టివల్ సీజన్ కి ముందు కొత్త ఫీచర్లతో హోండా ఎలివేట్
కొత్త ఫీచర్లతో హోండా ఎలివేట్

Honda Elevate : పండుగ సీజన్‌కు ముందు, కస్టమర్లను ఆకర్షించడానికి హోండా కార్స్ ఇండియా తన పాపులర్ ఎస్‌యూవీ హోండా ఎలివేట్‌ను కొత్త ఫీచర్లతో విడుదల చేసింది. ఇందులో కొత్త ఇంటీరియర్ కలర్ ఆప్షన్స్, స్టైలిష్ ఎలిమెంట్స్, ప్రత్యేక ప్యాకేజీలు వంటివి ఉన్నాయి. ముఖ్యంగా ఎలివేట్ ZX గ్రేడ్‌లో ఇప్పుడు కొత్త ఐవరీ ఇంటీరియర్ థీమ్ అందుబాటులోకి వచ్చింది. కొత్తగా అప్‌డేట్ అయిన హోండా ఎలివేట్ ZX గ్రేడ్‌లో ఐవరీ లెదరెట్ సీట్లు, డోర్ లైనింగ్‌లు, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానల్‌పై ఐవరీ సాఫ్ట్ టచ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి ఇప్పటికే ఉన్న ట్యాన్, బ్లాక్ క్యాబిన్ థీమ్‌లకు అదనంగా లభిస్తాయి. కస్టమర్లు తమ అభిరుచికి అనుగుణంగా కొత్త 360-డిగ్రీ సరౌండ్ విజన్ కెమెరా, 7 రంగుల అంబియంట్ లైటింగ్‌ను కూడా ఎంచుకోవచ్చు. బయటి వైపున, ఎలివేట్ ZX ట్రిమ్‌లో కొత్త ఆల్ఫా-బోల్డ్ ప్లస్ గ్రిల్ ఆప్షనల్‌గా లభిస్తుంది. అలాగే, ఎలివేట్ V, VX ట్రిమ్‌లలో షాడో బేజ్ ఫినిషింగ్ స్థానంలో కొత్త బ్లాక్ ఫ్యాబ్రిక్ అప్హోల్స్ట్రీని ఉపయోగించారు.
అన్ని V, VX, ZX ట్రిమ్‌లు ఇప్పుడు కొత్త క్రిస్టల్ బ్లాక్ పర్ల్ ఎక్స్టీరియర్ కలర్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది కారుకు మరింత ఆకర్షణీయమైన లుక్‌ను ఇస్తుంది. ఈ మార్పులతో పాటు, హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్, సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్లలో కూడా కాస్మెటిక్, ఫీచర్ అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. బ్లాక్ ఎడిషన్ క్రోమ్, సిల్వర్ యాక్సెంట్స్‌తో పాటు ఆల్-బ్లాక్ ఎక్స్టీరియర్‌ను కలిగి ఉంటుంది. ఇక సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ లో 7 కలర్ రిథమిక్ అంబియంట్ లైటింగ్, కొత్త ఆల్ఫా-బోల్డ్ ప్లస్ గ్రిల్ ఉన్నాయి.
కొత్త ఫీచర్లతో వచ్చిన ఎలివేట్ ZX ఐవరీ గ్రేడ్ ధర రూ.15.51 లక్షల నుంచి ప్రారంభమవుతుంది (ఎక్స్-షోరూమ్). V, VX గ్రేడ్‌ల ధరలు వరుసగా రూ.12.39 లక్షలు, రూ.14.13 లక్షలు. ఇంజిన్ విషయానికొస్తే, హోండా ఎలివేట్‌లో పవర్ఫుల్ 1.5L i-VTEC పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్‌తో లభిస్తుంది.
