Ampere Reo VYB : లైసెన్స్ అక్కర్లేదు.. రిజిస్ట్రేషన్ తో పనే లేదు.. మార్కెట్లోకి వచ్చేసిన సరికొత్త ఈ-స్కూటర్
మార్కెట్లోకి వచ్చేసిన సరికొత్త ఈ-స్కూటర్

Ampere Reo VYB : భారతదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న తరుణంలో, ప్రముఖ ఈవీ బ్రాండ్ ఆంపియర్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యతరగతి, బడ్జెట్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని సరికొత్త ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆంపియర్ రియో వీవైబీని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా రోజువారీ అవసరాల కోసం చిన్న దూరాలు ప్రయాణించే వారికి, విద్యార్థులకు, మొదటిసారి ఈవీ కొనాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. దీని ప్రారంభ ధరను రూ.69,499గా నిర్ణయించారు.
లైసెన్స్, రిజిస్ట్రేషన్ల లొల్లి లేదు
ఈ స్కూటర్ లో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. దీనికి డ్రైవింగ్ లైసెన్స్ గానీ, ఆర్టీవో రిజిస్ట్రేషన్ గానీ అవసరం లేదు. ఎందుకంటే ఇది లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేటగిరీ కిందకు వస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే. చట్టపరమైన నిబంధనల ప్రకారం ఇంత తక్కువ స్పీడ్ ఉన్న వాహనాలకు ఎలాంటి ఆర్సీ బుక్, నంబర్ ప్లేట్ లేదా లైసెన్స్ అవసరం లేదు. దీనివల్ల ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరిగే టెన్షన్, చలాన్లు పడతాయనే భయం కస్టమర్లకు ఉండదు.
అల్ట్రా లాంగ్ లైఫ్ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ
ఆంపియర్ రియో వీవైబీ స్కూటర్ లో కంపెనీ అత్యాధునిక లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీని అమర్చింది. సాధారణంగా ద్విచక్ర వాహనాలలో వాడే లిథియం-అయాన్ బ్యాటరీలతో పోలిస్తే ఈ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీలు అత్యంత సురక్షితమైనవి, ఎక్కువ కాలం మన్నుతాయి. ఈ బ్యాటరీ దాదాపు లక్ష కిలోమీటర్ల వరకు చెక్కుచెదరకుండా లైఫ్ ఇస్తుందని కంపెనీ గట్టిగా చెప్తోంది. దీనివల్ల లాంగ్ రన్ లో బ్యాటరీ మార్చాలనే అదనపు ఖర్చుల భారం చాలా వరకు తగ్గుతుంది.
సింగిల్ ఛార్జ్ తో 80 కిలోమీటర్ల రేంజ్
మైలేజ్ లేదా రేంజ్ విషయానికి వస్తే.. ఈ స్కూటర్ ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. సిటీ పరిధిలో కూరగాయలు తేవడానికి, ఆఫీసులకు వెళ్లడానికి, పిల్లలను స్కూల్ కి తీసుకెళ్లడానికి ఈ 80 కిలోమీటర్ల రేంజ్ చాలా ఎక్కువని చెప్పవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే మధ్యతరగతి జేబుకు ఇది ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది.
స్మార్ట్ ఫీచర్లు మరియు 24 లీటర్ల స్టోరేజ్
తక్కువ ధరలోనే వచ్చినప్పటికీ ఫీచర్ల విషయంలో ఆంపియర్ ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో కలర్ ఎల్‌సీడీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీ-లెస్ స్టార్ట్ సిస్టమ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, పవర్‌ఫుల్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు సీటు కింద ఏకంగా 24 లీటర్ల భారీ అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్‌ను ఇచ్చారు. ఇందులో హెల్మెట్, లగేజ్ బ్యాగ్స్ లేదా నిత్యావసర వస్తువులను చాలా ఈజీగా దాచుకోవచ్చు.
వారంటీ, 400 కి పైగా సర్వీస్ సెంటర్లు
రైడింగ్ కంఫర్ట్ కోసం ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో డ్యాంపర్ సస్పెన్షన్ సిస్టమ్ ఇచ్చారు. ఇది రోడ్డుపై ఉన్న గుంతల షాక్ ల నుండి కాపాడుతుంది. ఈ స్కూటర్ వార్మ్ వైట్, పాస్టెల్ పర్పుల్, డార్క్ గ్రే, ఆక్వా మెటాలిక్ అనే 4 ఆకర్షణీయమైన కలర్స్ లో లభిస్తుంది. కస్టమర్ల నమ్మకం కోసం కంపెనీ ఈ స్కూటర్ పై 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వరకు వారంటీని ఇస్తోంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 400 కంటే ఎక్కువ సర్వీస్ సెంటర్ల ద్వారా 12×7 కస్టమర్ సపోర్ట్ సేవలను కూడా అందిస్తోంది.

