Ather Energy : ఇకపై మాటలతోనే నడిచే ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరిపోయే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్
అదిరిపోయే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్

Ather Energy : ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన కస్టమర్ల కోసం ఒక అద్భుతమైన అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. కంపెనీ మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మోడళ్లు అయిన ఏథర్ రిజ్టా, 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం సరికొత్త ఏథర్ స్టాక్ 7 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సరికొత్త అప్‌డేట్ ద్వారా స్కూటర్లలో ఎన్నో అధునాతన సేఫ్టీ, కనెక్టివిటీ ఫీచర్లు యాడ్ అయ్యాయి. ఇందులో అత్యంత విశేషమైన విషయం ఏంటంటే, ఈ అప్‌డేట్ కోసం కస్టమర్లు ఎవరూ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఓవర్ ది ఎయిర్ ద్వారా ఇంటర్నెట్ సాయంతో స్కూటర్లు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయిపోతాయి.
నోటి మాటతో కంట్రోల్ అయ్యే స్మార్ట్ స్కూటర్
ఈ సరికొత్త అప్‌డేట్‌లో లభించే అత్యంత రసవత్తరమైన ఫీచర్ వాయిస్ కమాండ్. దీని సహాయంతో రైడర్ ప్రయాణంలో ఉన్నప్పుడు స్కూటర్ డిస్‌ప్లేను పదే పదే తాకాల్సిన అవసరం లేకుండా, కేవలం తన వాయిస్ ద్వారానే స్కూటర్‌ను కంట్రోల్ చేయవచ్చు. నావిగేషన్ సెట్ చేయడం, ఎవరికైనా ఫోన్ కాల్స్ చేయడం, ప్రయాణంలో నచ్చిన మ్యూజిక్ ప్లే చేయడం వంటి పనులన్నీ కేవలం నోటి మాటతోనే జరిగిపోతాయి. ఈ వాయిస్ అసిస్టెంట్ సిస్టమ్ సాధారణ వాడుక భాషను కూడా చాలా సులభంగా అర్థం చేసుకుంటుంది. దీనివల్ల నగరాల్లో ట్రాఫిక్ లో ప్రయాణించేటప్పుడు రైడర్ దృష్టి రోడ్డుపైనే ఉంటుంది కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తగ్గుతుంది.
రోడ్డు గుంతలపై ముందే అలర్ట్
ఏథర్ స్టాక్ 7 సాఫ్ట్‌వేర్‌లో రైడర్ల భద్రత కోసం ప్రవేశపెట్టిన అత్యంత ఉపయోగకరమైన ఫీచర్ పోట్‌హోల్ అలర్ట్స్. స్కూటర్ లో అమర్చిన ప్రత్యేక సెన్సార్ల సహాయంతో ఇది రోడ్డుపై ముందున్న గుంతలను ముందే పసిగడుతుంది. ఆ గుంతల గురించిన సమాచారాన్ని కేవలం స్క్రీన్ పైనే కాకుండా వాయిస్ అలర్ట్ ద్వారా కూడా రైడర్‌కు అందిస్తుంది. దీనివల్ల రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు లేదా అకస్మాత్తుగా వచ్చే రోడ్డు గుంతల నుంచి వాహనాన్ని సురక్షితంగా పక్కకు తప్పించుకోవడానికి రైడర్‌కు తగినంత సమయం దొరుకుతుంది. తద్వారా ప్రమాదాలు జరగకుండా ముందే అడ్డుకోవచ్చు.
ప్రమాద సమయాల్లో ప్రాణదాతగా క్రాష్ అలర్ట్స్
ఒకవేళ రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు దురదృష్టవశాత్తూ ఏదైనా తీవ్రమైన ప్రమాదం జరిగితే, ఈ స్కూటర్ వెంటనే స్పందిస్తుంది. ఇందులో కొత్తగా చేర్చిన క్రాష్ అలర్ట్స్ ఫీచర్.. స్కూటర్ కిందపడినప్పుడు అది చిన్న జరకా లేదా పెద్ద ప్రమాదమా అనేది ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఒకవేళ ప్రమాదం తీవ్రంగా ఉంటే, రైడర్ యొక్క లైవ్ లొకేషన్‌ను వారి కుటుంబ సభ్యులకు లేదా ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లకు మెసేజ్ రూపంలో ఆటోమేటిక్‌గా పంపుతుంది. అంతేకాకుండా, ప్రమాదం జరిగిన వెంటనే స్కూటర్ స్క్రీన్ పై ఎమర్జెన్సీ కాంటాక్ట్ వివరాలు డిస్‌ప్లే అవుతాయి, దీనివల్ల రోడ్డుపై వెళ్లే ఇతర వ్యక్తులు ఆ నంబర్లకు ఫోన్ చేసి సహాయం చేయడానికి వీలుంటుంది.
దొంగతనాలు కాకుండా పార్క్‌సేఫ్, లాక్‌సేఫ్ రక్షణ
వాహనాల భద్రతను మరింత పెంచడానికి ఏథర్ కంపెనీ పార్క్‌సేఫ్, లాక్‌సేఫ్ అనే రెండు అద్భుతమైన ఫీచర్లను తీసుకొచ్చింది. నో-పార్కింగ్ జోన్లలో లేదా మున్సిపల్ అధికారులు కారును టోయింగ్ చేసే ప్రాంతాల్లో స్కూటర్ పార్క్ చేస్తే పార్క్‌సేఫ్ ఫీచర్ రైడర్‌ను అలర్ట్ చేస్తుంది. ఇక లాక్‌సేఫ్ ఫీచర్ విషయానికి వస్తే.. ఎవరైనా స్కూటర్‌ను దొంగిలించడానికి ప్రయత్నించినా లేదా లాక్ పగలగొట్టాలని చూసినా వెంటనే యజమాని స్మార్ట్‌ఫోన్‌కు నోటిఫికేషన్ పంపుతుంది. ఈ అప్లికేషన్ ద్వారా యజమాని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, తన ఏథర్ యాప్ ద్వారా స్కూటర్‌ను రిమోట్‌గా లాక్ చేయవచ్చు లేదా డిసేబుల్ చేయవచ్చు. అలాగే ఇంట్లో ఛార్జింగ్ అవుతున్నప్పుడు కూడా ఫోన్ ద్వారానే ఛార్జింగ్‌ను ఆపేయవచ్చు.

