అమ్మకాల్లో రికార్డు సృష్టించిన ఏథర్ ఎనర్జీ

Ather Energy : భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఏథర్ ఎనర్జీ ఒక పెద్ద విజయాన్ని సాధించింది. దేశంలో ఇప్పటివరకు ఏకంగా 4 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి కొత్త మైలురాయిని చేరుకుంది. 2018లో తమ మొదటి స్కూటర్‌ను విడుదల చేసిన ఏథర్, జూలై 2025 చివరి నాటికి మొత్తం 4,02,207 యూనిట్లను అమ్మగలిగింది. ఈ భారీ విజయానికి కారణం ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో ఏథర్ సాధించిన అద్భుతమైన అమ్మకాలు.

ప్రస్తుతం ఏథర్ భారత మార్కెట్‌లో నాలుగు రకాల స్కూటర్లను అమ్ముతోంది. అవి ఏథర్ రిజ్తా, ఏథర్ 450X, ఏథర్ 450S, ఏథర్ 450 Apex. వీటిలో రిజ్తా అనే మోడల్ అన్నిటికంటే తక్కువ ధరలో లభిస్తూ చాలా పాపులర్ అయింది. దీని ధర రూ.లక్ష నుంచి మొదలవుతుంది. ఇక అన్నిటికంటే ఖరీదైన మోడల్ ఏపెక్స్ దీని ధర రూ. 1.90 లక్షల వరకు ఉంటుంది.

ఏథర్ రిజ్తా విజయానికి ఒక ముఖ్యమైన కారణం దాని సరసమైన ధర. ఏప్రిల్ 2024లో విడుదలైనప్పటి నుంచి కేవలం 13 నెలల్లోనే ఈ స్కూటర్ లక్ష యూనిట్ల అమ్మకాల మార్క్‌ను దాటింది. ఏథర్ మొత్తం అమ్మకాల్లో రిజ్తా వాటా 60% కంటే ఎక్కువగా ఉంది. ఈ స్కూటర్ మూడు వేరియంట్లలో వస్తుంది. రిజ్తా ఎస్ (రూ. 99,999), రిజ్తా జెడ్ 2.9 (రూ. 1,14,500), రిజ్తా జెడ్ 3.7 (రూ. 1,42,000). ఒక్కసారి ఛార్జ్ చేస్తే 123 కి.మీ నుండి 159 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.

ఏథర్ సంస్థ జూలై 1న తమ రిజ్తా స్కూటర్ రేంజ్‌ను మరింత పెంచుతూ కొత్తగా ఎస్ వేరియంట్‌ను 3.7kWh బ్యాటరీ ప్యాక్‌తో మార్కెట్‌లోకి తెచ్చింది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 159 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,37,047గా ఉంది. ఈ స్కూటర్లను ఏథర్ గ్రిడ్ అనే ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ నెట్‌వర్క్‌లో దేశవ్యాప్తంగా 3,900కు పైగా ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story