Ather Konarc: ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో సంచలనం.. ఏథర్ కోనార్క్ లాంచ్ ఫిక్స్
ఏథర్ కోనార్క్ లాంచ్ ఫిక్స్

Ather Konarc: ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన రాబోయే మోడల్ కోనార్క్ టీజర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసి ఆటోమొబైల్ ప్రేమికుల్లో ఆసక్తిని పెంచేసింది. కంపెనీ సీఈఓ తరుణ్ మెహతా షేర్ చేసిన వీడియోలో స్కూటర్ బాడీ ప్యానెల్‌కు అయస్కాంతం అతుక్కుపోవడం కనిపిస్తోంది. దీన్ని బట్టి కొత్త స్కూటర్‌లో ప్లాస్టిక్‌కు బదులుగా బలమైన మెటల్ బాడీ ప్యానెళ్లను ఉపయోగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. హోండా యాక్టివా, బజాజ్ చేతక్ వంటి పాపులర్ స్కూటర్లకు గట్టి పోటీ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కుటుంబ ప్రయాణాలకు అత్యంత సౌకర్యవంతం
ఏథర్ నుంచి వస్తున్న కొత్త ఈఎల్ ప్లాట్‌ఫామ్‌పై ఈ స్కూటర్ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటివరకు రేసింగ్, పెర్ఫార్మెన్స్ లుక్‌తో ఉన్న 450 సిరీస్ కాకుండా, కోనార్క్ స్కూటర్‌ను పూర్తిస్థాయి ఫ్యామిలీ ఈవీగా డిజైన్ చేశారు. ప్రతీరోజు ఆఫీస్‌కు వెళ్లేవారికి, కుటుంబంతో ప్రయాణించేవారికి అనుకూలంగా విశాలమైన ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, సౌకర్యవంతమైన పొడవైన సీటు, హ్యాండిల్‌బార్‌పై హెడ్‌ల్యాంప్ అమర్చారు. ముందరి భాగంలో 14 అంగుళాల వీల్, వెనుక భాగంలో 12 అంగుళాల వీల్ ఉండనున్నాయి.
అధునాతన రీజెనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ
రైడర్ల భద్రతకు ఏథర్ పెద్దపీట వేసింది. ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌తో పాటు అధునాతన ఎలక్ట్రికల్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అందించనున్నారు. ఇది రీజెనరేటివ్, సాధారణ బ్రేకింగ్‌ను సమర్థవంతంగా మేళవించి వాహనాన్ని సురక్షితంగా నిలుపుతుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ సస్పెన్షన్ వల్ల రోడ్డుపై ఉన్న గుంతలను సైతం తట్టుకుని ప్రయాణం సఫీగా సాగుతుంది. వివిధ రైడింగ్ మోడ్స్, రివర్స్ అసిస్ట్, హిల్-హోల్డ్ కంట్రోల్ వంటి ప్రీమియం సౌకర్యాలు ఇందులో కలవు.
స్మార్ట్ ఫీచర్లు.. బ్యాటరీ సర్వీస్ ఆప్షన్
కోనార్క్ స్కూటర్‌లో ఏథర్ స్టాక్ 7.0 సాఫ్ట్‌వేర్‌తో కూడిన టీఎఫ్‌టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండనుంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ లేకుండానే స్వతంత్రంగా పనిచేసే ఆన్‌బోర్డ్ నావిగేషన్, వాయిస్ కమాండ్స్, గుంతల హెచ్చరికలు, యాక్సిడెంట్ నోటిఫికేషన్లు వంటి స్మార్ట్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఈ మోడల్ ఎస్, క్యూ విభాగాలలో మొత్తం 6 వేరియంట్లలో రాబోతోంది. బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ ప్రోగ్రామ్ ద్వారా బ్యాటరీ లేకుండా తక్కువ ధరకే స్కూటర్ కొనుగోలు చేసి, నెలకు బ్యాలెన్స్ ప్లాన్ ఎంచుకునే సౌలభ్యం కల్పించే ఆలోచనలో కంపెనీ ఉంది.

