Ather Energy : ఏథర్ నుంచి బిగ్ ధమాకా.. ఆగస్టు 29న తక్కువ ధరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్

Ather Energy : భారతీయ ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ భారత మార్కెట్లో కొత్త హంగామాకు సిద్ధమైంది. కంపెనీ తన నూతన ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ కోణార్క్ ను ఆగస్టు 29, 2026న అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఏథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా ఒక టీజర్ వీడియోను పంచుకుంటూ ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఏథర్ కమ్యూనిటీ డే ఈవెంట్‌లో ఈ స్కూటర్‌ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
టీజర్‌లో కనిపించిన అదిరిపోయే డిజైన్ వివరాలు
విడుదల చేసిన టీజర్ వీడియో ఆధారంగా ఏథర్ కోణార్క్ స్కూటర్ సరికొత్త, మోడ్రన్ డిజైన్‌తో రూపుదిద్దుకున్నట్లు స్పష్టమవుతోంది. స్కూటర్ ముందు భాగంలో, వెనుక భాగంలో ఆకర్షణీయమైన U షేప్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ఇవ్వబడ్డాయి. ఇది స్కూటర్‌కు ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. ఇవే కాకుండా ముందు భాగంలో డిస్క్ బ్రేక్, అలాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ అందించారు. రోడ్డుపై మెరుగైన గ్రిప్, ప్రయాణంలో సౌకర్యం కోసం ఇందులో 14-అంగుళాల పెద్ద టైర్లను ఉపయోగించారు.
అడ్వాన్స్‌డ్ కొత్త 'EL' ప్లాట్‌ఫామ్‌పై రూపకల్పన
ఏథర్ కోనార్క్ స్కూటర్ కంపెనీ సరికొత్తగా అభివృద్ధి చేసిన EL ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి నిర్మించబడింది. భవిష్యత్తులో వేర్వేరు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయడానికి ఈ అడ్వాన్స్‌డ్ ప్లాట్‌ఫామ్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ ప్లాట్‌ఫామ్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో 2 kWh నుంచి 5 kWh కెపాసిటీ కలిగిన బ్యాటరీలను సులభంగా అమర్చవచ్చు. అంటే రాబోయే రోజుల్లో కస్టమర్ల బడ్జెట్, రేంజ్ అవసరాలకు అనుగుణంగా ఏథర్ కంపెనీ కొత్త వెర్షన్లను సులభంగా మార్కెట్లోకి తీసుకురాగలదు.
ధర ఎంత ఉండవచ్చు?
మీడియా కథనాలు, విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఏథర్ కోణార్క్ కంపెనీ చరిత్రలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలవనుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. లక్ష నుంచి రూ.1.20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే ధరకు అందుబాటులోకి వస్తే.. బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో ఓలా, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ వంటి మోడళ్లకు ఏథర్ కోణార్క్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.
అందుబాటులో ఉండే స్మార్ట్ ఫీచర్లు
కంపెనీ ఇంకా సాంకేతిక వివరాలను పూర్తిగా వెల్లడించనప్పటికీ.. ఈ స్కూటర్‌లో 14-అంగుళాల ఫ్రంట్, 12-అంగుళాల రియర్ అలాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్, రియర్ డ్రమ్ బ్రేక్ సెటప్ ఉండనున్నాయి. దీనితో పాటు 7-అంగుళాల టిఎఫ్‌టి టచ్ డిస్ప్లే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్స్, మెసేజ్ అలర్ట్స్ వంటి ఆధునిక స్మార్ట్ ఫీచర్లు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. బడ్జెట్ ధరలో అధునాతన ఫీచర్లు కోరుకునే వారికి ఏథర్ కోనార్క్ ఒక అద్భుతమైన ఎంపికగా మారనుంది.

