Budget 2026 : ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నుల తగ్గింపు ఉండాలా? స్కోడా, ఎంజీ మోటార్స్ ఏం అడుగుతున్నాయి?
స్కోడా, ఎంజీ మోటార్స్ ఏం అడుగుతున్నాయి?

Budget 2026 : ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో భారత ఆటోమొబైల్ రంగానికి చెందిన దిగ్గజ కంపెనీలు తమ అంచనాలను, కోర్కెలను ప్రభుత్వం ముందు ఉంచాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెంచడానికి, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే కార్ల అమ్మకాలను ప్రోత్సహించడానికి ఈ బడ్జెట్ కీలకమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
భారతదేశ ఆటోమొబైల్ రంగం ప్రస్తుతం ఒక కీలక దశలో ఉంది. ఒకవైపు ప్రీమియం కార్ల అమ్మకాలు బాగున్నా, సామాన్యులు కొనే ఎంట్రీ లెవల్ కార్లు, టూవీలర్ల అమ్మకాలు నెమ్మదించాయి. అందుకే ఈసారి బడ్జెట్‌లో డ్యూటీ స్ట్రక్చర్ హేతుబద్ధీకరణ జరగాలని వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వాడే విడిభాగాలపై దిగుమతి సుంకాలను తగ్గిస్తే, కార్ల ధరలు తగ్గి సామాన్యులకు అందుబాటులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా చార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని వోల్వో కోరుతోంది.
స్కోడా ఆటో ఫాక్స్ వ్యాగన్ ఇండియా సీఈఓ పీయూష్ అరోరా మాట్లాడుతూ.. ఈవీల తయారీలో ప్రస్తుతం ఉన్న ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ (విడిభాగాలపై ఎక్కువ పన్ను, తయారైన కారుపై తక్కువ పన్ను ఉండటం) వల్ల కంపెనీల మీద భారం పడుతోందని, దాన్ని సరిచేయాలని కోరారు. ఇది జరిగితే స్వదేశీ తయారీకి ఊతం లభిస్తుందని ఆయన తెలిపారు. అలాగే ప్రజల దగ్గర ఖర్చు చేయడానికి వీలుగా ఆదాయపు పన్నులో మార్పులు చేస్తే, వాహనాలకు డిమాండ్ పెరుగుతుందని ఆయన విశ్లేషించారు.
జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఎండీ అనురాగ్ మెహ్రోత్రా కూడా ఇదే ధోరణిని వ్యక్తం చేశారు. కేవలం కంపెనీలకే కాకుండా, వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే ఇన్సెంటివ్ పథకాలను (FAME లేదా PM E-DRIVE వంటివి) మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా బ్యాటరీ సెల్స్, కంట్రోలర్లు వంటి కీలక భాగాల తయారీ భారత్ లోనే జరిగేలా పీఎల్ ఐ పథకాన్ని విస్తరించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది.
పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. కమర్షియల్ ఈవీలకు మద్దతు ఇవ్వడం వల్ల పర్యావరణానికి ఎక్కువ లాభం జరుగుతుంది. ఎందుకంటే ఇవి సాధారణ కార్ల కంటే ఐదు రెట్లు ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. అందుకే బడ్జెట్ లో వీటికి ప్రత్యేక స్థానం కల్పించాలని టాటా మోటార్స్ వంటి సంస్థలు కూడా కోరుతున్నాయి. మొత్తానికి 2026 బడ్జెట్ భారత రోడ్లను గ్రీన్ మొబిలిటీ వైపు నడిపించే ఒక దిక్సూచిలా మారుతుందని అందరూ ఆశిస్తున్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి చేసే ప్రకటనలు వాహన ధరల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.

